Site icon HashtagU Telugu

Mahashivratri 2025 : భక్తులకు APSRTC గుడ్ న్యూస్

Mahashivratri Apsrtc

Mahashivratri Apsrtc

మహాశివరాత్రి (Mahashivratri 2025) సందర్భంగా భక్తుల కోసం ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని వివిధ శైవక్షేత్రాలకు భక్తులు సులభంగా చేరుకునేందుకు 3,500 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకువస్తోంది. మొత్తం 99 శైవక్షేత్రాలకు ఈ ప్రత్యేక బస్సులను నడిపేందుకు సన్నాహాలు చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ముఖ్యంగా వైఎస్సార్, నెల్లూరు, తిరుపతి, నంద్యాల జిల్లాల్లోని ప్రముఖ శైవాలయాలకు ప్రత్యేక బస్సుల సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.

శ్రీశైలానికి భక్తుల రద్దీ అధికంగా ఉండే నేపథ్యంలో అన్ని ప్రధాన పట్టణాలు, డిపోల నుంచి అదనపు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రత్యేక సర్వీసుల ద్వారా ఏపీఎస్ఆర్టీసీ సుమారు రూ. 11 కోట్ల ఆదాయం రాబట్టనున్నట్లు అంచనా వేస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా మాత్రమే కాకుండా, మహాకుంభమేళాకు కూడా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచారు. భక్తుల ప్రయాణాన్ని సౌకర్యవంతం చేయడానికి ప్రత్యేక ప్యాకేజీలు కూడా ప్రకటించారు. ఇక శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు జరగనున్నాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో ఆర్జిత సేవలను రద్దు చేసి, శివ దీక్షాపరులకు ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు స్పర్శ దర్శనం అందుబాటులో ఉంచనున్నారు. శ్రీశైలం దేవస్థానం భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూలైన్లు, భద్రతా ఏర్పాట్లు చేపడుతోంది.

భక్తుల రక్షణ కోసం పాతాళగంగ వద్ద రక్షణ కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. మహిళల సౌకర్యార్థం ప్రత్యేకంగా దుస్తులు మార్చుకునే గదులను ఏర్పాటు చేస్తున్నారు. అన్నదాన కేంద్రాలను మరింత విస్తృతంగా నిర్వహించి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మహాశివరాత్రి వేడుకలను భక్తులు ప్రశాంతంగా, భద్రతతో జరుపుకోవడంలో దేవస్థానం మరియు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.