Ayodhya: అయోధ్యలో బాలరాముడి ఆలయంలో రెండో దశ విగ్రహాల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. రామాలయ ప్రాంగణంలోని ప్రధాన గర్భగుడిలో ఏర్పాటు చేసిన రామ్‌దర్బార్ విభాగంలో స్థాపించిన విగ్రహాలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 11.45 గంటలకు ప్రారంభమైన అభిజిత్ ముహూర్తంలో ఈ పవిత్ర కార్యం ఆరంభమైంది. ఇది మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ఈ వేడుకలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన స్వయంగా రామ్‌దర్బార్‌లోని విగ్రహాలకు హారతి ఇచ్చారు. కార్యక్రమానికి ముందు యోగి ఆదిత్యనాథ్ హనుమాన్ గడీ ఆలయాన్ని దర్శించారు. అనంతరం బాలరాముడి ఆలయ ప్రాంగణానికి చేరుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Read Also: NTR -Neel : 2 వేల మందితో భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసిన డైరెక్టర్
ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి వచ్చిన 101 మంది వేదపండితులు వేదమంత్రోచ్ఛారణలతో శాంతిపఠనం చేశారు. వారి ఆధ్వర్యంలో విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ జరుగగా, భక్తులు ఈ ఘట్టానికి సాక్షులయ్యారు. వేదఘోషల మధ్య ఆలయవాతావరణం దివ్యంగా మారిపోయింది. ఇక ఆలయం పరిధిలోని ఏడు ఉపాలయాల్లో కూడా ఈ రోజు విగ్రహ ప్రతిష్ఠలు జరిగాయి. ప్రతి ఉపాలయానికి ప్రత్యేకంగా ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ ఉపాలయాలు కూడా ప్రధాన ఆలయ నిర్మాణ శైలిలోనే శిల్పకళకు అద్భుతంగా ప్రతిరూపంగా నిలిచాయి.
ఇందులో విశేషంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, రామ్‌దర్బార్ మరియు ఇతర ఉపాలయాల కోసం అవసరమైన ద్వారాలను తెలంగాణ రాష్ట్రం నుండి ప్రత్యేకంగా తయారు చేసి పంపించడం. మొత్తం 14 ఉపాలయాలకూ ఇక్కడి శిల్పులు తయారు చేసిన కలప ద్వారాలను పంపారు. ఈ ద్వారాలు అలంకారిక శిల్పకళలో ప్రాచీన హస్తకళా నైపుణ్యాన్ని ప్రతిబింబించాయి. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత యోగి ఆదిత్యనాథ్ మహంత్ నృత్యగోపాల్ దాస్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. అయోధ్య అభివృద్ధిలో ఆయన సేవలను కొనియాడారు. రామాలయ నిర్మాణ దశలో జరిగే ప్రతి ఘట్టం ఎంతో చారిత్రాత్మకంగా మిగలిపోతోంది. ఈ రోజు నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం రామభక్తులకు మరొక ఆధ్యాత్మిక మైలురాయిగా నిలిచింది.
Read Also: Sindhura plant : ఈ మొక్క మన దేశ మహిళా శక్తి, శౌర్యం, స్ఫూర్తికి బలమైన చిహ్నం: ప్రధాని మోడీ