Tirumala Tirupati: ద్వారకా తిరుమల క్షేత్రం భారతదేశంలో అత్యంత ప్రాచీన క్షేత్రముగా చెప్పబడుతుంది. ఈ క్షేత్రంలో శేషాద్రి కొండ మీద కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. స్వయంభూవుగా ప్రత్యెక్షమైన వెంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారకా అనే ముని పేరు మీద ఈ ప్రదేశమునకు ద్వారకా తిరుమల అన్న పేరు వచ్చింది. భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నింటిలోకి ఇక్కడున్న ఆలయం భిన్నంగా ఉంటుంది. దేవాలయానికి ఉత్తరాన పంపా నది ప్రవహిస్తుంది. దేవాలయం ఉభయ గోదావరి జిల్లా తో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ చిన్న తిరుపతి గా ప్రసిద్ధికెక్కింది.
తిరుమల తిరుపతి(పెద్ద తిరుపతి) లో స్వామి వారికి మొక్కిన మ్రొక్కును చిన్న తిరుపతి లో తీర్చుకున్నా అదే ఫలితం లభిస్తుంది అని భక్తుల విశ్వాసం. అయితే చిన్న తిరుపతి లో మొక్కిన మొక్కులు చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలి అని భక్తులు, స్థానికుల నమ్మకం. స్థల పురాణము ప్రకారము ఈ క్షేత్రము రాముని తండ్రి దశరథ మహారాజు కాలము నాటిదని భావిస్తారు. “ద్వారకుడు” అనే ఋషి తపసు చేసి స్వామివారి పాదసేవను కోరాడు. కనుక పాదములు పూజించే భాగ్యం అతనికి దక్కింది. పైభాగము మాత్రమే మనకు దర్శనమిస్తుంది. విశిష్టాద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించినారనీ, అందరూ స్వామి పాదపూజ చేసుకొనే భాగ్యం కలిగించాలని భావించాడు.
దీంతో మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త ధ్రువమూర్తికి వెనుకవైపు పీఠంపై వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్ఠించారని అంటారు. స్వయంభువుగా వెలసిన, అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే, ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందనీ, తరువాత ప్రతిష్ఠింపబడిన పూర్తిగా కనుపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్ధకామ పురుషార్ధములు సమకూరుతాయనీ భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామి వారికి అభిషేకము చేయక పోవడము ఇంకొక విశేషం.