Site icon HashtagU Telugu

Amarnath Yatra 2024 : అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం.. బయలుదేరిన మొదటి బ్యాచ్

Amarnath Yatra 2024

Amarnath Yatra 2024 : పవిత్ర అమర్‌నాథ్ యాత్ర ఇవాళ ప్రారంభమైంది. అమర్‌నాథ్ గుహ దర్శనం కోసం 4,603 మందితో కూడిన యాత్రికుల మొదటి బ్యాచ్ జమ్మూకశ్మీర్‌‌లోని గందర్‌బాల్ జిల్లాలో ఉన్న బల్తాల్ బేస్ క్యాంప్ నుంచి శుక్రవారమే బయలుదేరింది. భంభం భోలే, హర హర మహాదేవ్ నినాదాలు చేస్తూ భక్తులు ముందుకుసాగారు. శ్రీనగర్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని దాదాపు 13000 అడుగుల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్ గుహకు చేరుకోవడంతో భక్తుల ప్రయాణం ముగుస్తుంది. ఈ తీర్థయాత్ర ఆగస్టు 19 వరకు 52 రోజుల పాటు కొనసాగనుంది.

We’re now on WhatsApp. Click to Join

చాలా ఎత్తులో అమర్‌నాథ్ గుహ(Amarnath Yatra 2024) ఉండటంతో అక్కడ ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉంటుంది. దీంతో అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు తొలిసారిగా భక్తుల కోసం ముమ్మరంగా వైద్య ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం 100 శాశ్వత ఆక్సిజన్ బూత్‌లు, మొబైల్ ఆక్సిజన్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది.  వందలాది ఐసీయూ పడకలు, అధునాతన పరికరాలు, ఎక్స్‌రే, అల్ట్రాసోనోగ్రఫీ యంత్రం, క్రిటికల్ కేర్ నిపుణులు, కార్డియాక్ మానిటర్లు, లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్‌తో కూడిన రెండు క్యాంపు ఆసుపత్రులను బాల్తాల్, చందన్‌బరి ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. పరమశివుడు పార్వతీమాతకు ఎన్నో రహస్యాలు చెప్పిన శక్తివంతమైన ప్రదేశం అమర్‌నాథ్ గుహే అని చెబుతారు. అందుకే అమర్‌నాథ్ యాత్రను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.

Also Read :Brahmanda Yoga : శనీశ్వరుడి తిరోగమనం.. ఆ మూడు రాశులవారికి బ్రహ్మాండ యోగం!

ఈ యాత్ర కోసం సైన్యం, పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశాయి. ఇటీవలే కశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు జరిగిన నేపథ్యంలో భద్రతా బలగాలు హైఅలర్ట్‌ మోడ్‌లో ఉన్నాయి. ఈ యాత్ర నేపథ్యంలో 13 పోలీసు బృందాలు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన 11, ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన 8, బీఎస్‌ఎఫ్‌కు చెందిన 4, సీఆర్‌పిఎఫ్‌కు చెందిన రెండు బృందాలను హై సెక్యూరిటీ పాయింట్ల వద్ద మోహరించారు. ట్రాఫిక్‌ను పర్యవేక్షించడానికి ఉధంపూర్ నుంచి బనిహాల్ వరకు 10 హై ఎండ్ కెమెరాలను ఏర్పాటు చేశారు.

Also Read :MP Dharmapuri Arvind : ‘‘ఐ విల్ మిస్ యూ డ్యాడీ’’.. డీఎస్ కుమారుడు ఎంపీ అర్వింద్ ఎమోషనల్ పోస్ట్

అమర్‌నాథ్ గుహకు చేరుకునేందుకు రెండు రూట్లు ఉన్నాయి. ఒకటి పహల్గామ్ రూట్.  ఈ మార్గంలో గుహను చేరుకోవడానికి 3 రోజులు పడుతుంది. రెండోది బాల్తాల్ రూట్. అయితే ఈ మార్గం చాలా నిటారుగా ఉంటుంది. అందుకే ఈ రూటులో వృద్ధులు వెళ్లడం కష్టతరంగా ఉంటుంది.