TTD: ఏప్రిల్ 2న ఆళ్వార్‌ తిరుమంజనం.. పూజరులు ఏం చేస్తారంటే!

  • Written By:
  • Publish Date - March 29, 2024 / 11:15 AM IST

ఏప్రిల్ 9వ తేదీన ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుకుని ఏప్రిల్ 2వ తేదీన మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. అయితే.. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం తిరుమల ఆలయంలో ఆనవాయితీగా వస్తోంది. ఆళ్వార్‌ తిరుమంజనం ఏప్రిల్ 2న ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు తిరుమల అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు సహా సామగ్రి ఇతర వస్తువులను అన్నిటినీ నీటితో శుభ్రంగా కడుగుతారు.

ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి తర్వాత నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. ఆ తర్వాత స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తలగించి ప్రత్యేక పూజలు చేస్తారు.