కర్రల సమరానికి కర్నూలు జిల్లా దేవరగట్టు సిద్ధమైంది. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా కర్రల సమరం జరుగుతోంది. దీనినే బన్నీ ఉత్సవం అని కూడా అంటారు. విజయదశమి రోజు అర్ధరాత్రి ఈ ఉత్సవం జరుగుతుంది. మాల మల్లేశ్వరస్వామికి కల్యాణం నిర్వహించిన అనంతరం.. కర్రల సమరం జరపడం ఇక్కడ ఆనవాయితీ. ఈ వేడుకలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. అసలు ఇక్కడ కర్రల సమరం జరపడం వెనక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!
దేవరగట్టు కొండ ప్రాంతంలో సమీపంలోని 11 గ్రామాల ప్రజలు ఈ ఉత్సవాన్ని వైభవంగా జరుపుకుంటారు. దసరా పండుగ రోజు అర్ధరాత్రి కొండపై ఉన్న మాలమల్లేశ్వరస్వామికి కల్యాణం జరుగుతుంది. అనంతరం మాల సహిత మల్లేశ్వరస్వామి విగ్రహాలను పల్లకిలో ఊరేగింపుగా తీసుకెళ్తారు. అయితే.. నెరణికి, నెరణికి తండా, కొత్తపేటకు చెందిన గ్రామాల ప్రజలు ఆ విగ్రహాలకు రక్షణగా నిలుస్తారు.ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, అరికెర, నిడ్రవట్టి గ్రామాల ప్రజలు మరో వర్గంగా మరో గ్రూపు వారిని ఆపే ప్రయత్నం చేస్తారు. ఇలా రెండు గ్రూపుల మధ్య కర్రల సమరం నడుస్తుంది. అనంతరం విగ్రహాలను తిరిగి దేవరగట్టు మీద ఉంచడంతో ఉత్సవం పూర్తవుతుంది. ఈ సందర్భంగా జరిగే కర్రల సమరంలో వందలాది మంది తలలు పగులుతుంటాయి.
కర్రల సమరం సందర్భంగా ఏటా పదుల సంఖ్యలో భక్తులు గాయపడుతుంటారు. తీవ్రంగా రక్తమోడుతూ ఒక్కోసారి పరిస్థితి విషమించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని కొనసాగించి తీరతామని సమీప గ్రామ ప్రజలు చెబుతున్నారు. ఇది సంబరమే గానీ సమరం కాదంటున్నారు. రక్తపాతంకు తావులేకుండా ఉత్సవాన్ని నిర్వహించుకోవాలని పోలీసులు, అధికారులు సూచిస్తున్నారు. ఈసారి ప్రత్యేకంగా 1500 మంది పోలీసుతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఈ ఉత్సవంలో ప్రతి సంవత్సరంర పదుల సంఖ్యలో భక్తులు తీవ్రంగా గాయపడుతూనే ఉన్నారు. ఈసారైనా రక్తపాతం ఆగుతుందో లేదో చూడాల్సిందే..!