TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. దర్శనం టికెట్ల వివరాలు ఇదిగో

  • Written By:
  • Updated On - May 10, 2024 / 12:45 PM IST

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆగస్టు నెలకు సంబంధించిన దర్శనం, వసతి, శ్రీవారి సేవ కోసం ఆన్లైన్ కోటా విడుదల వివరాలను ప్రకటించింది. టిటిడి అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా భక్తులు తమ స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 18న ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంటుంది. మే 20వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యాహ్నం వరకు ఈ సేవలకు పేమెంట్ విండో తెరిచి ఉంటుంది.

ఈ నెల 21న ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కల్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు, ఎస్డీ సేవ టికెట్లతో పాటు 15 నుంచి 17వ తేదీ వరకు జరిగే పవిత్రోత్సవాల టికెట్లను భక్తులు బుక్ చేసుకోవచ్చు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను విడుదల చేయనున్నారు. తిరుమలలో అంగప్రదక్షిణకు ఈ నెల 23న ఉదయం 10 గంటలకు టోకెన్లు బుక్ చేసుకోవచ్చు.

శ్రీవాణి ట్రస్ట్ దాతలకు దర్శనం, వసతి కోటా ఉదయం 11 గంటలకు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు కోటా 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతికి వసతి కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. చివరికి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలో శ్రీవారి సేవకు జనరల్ కోటా, మధ్యాహ్నం నవనీత సేవ, మధ్యాహ్నం ఒంటి గంటకు పరకామణి సేవకు జనరల్ కోటా విడుదల చేయనున్నారు.