A Priest – A Clay Pot : ‘అనగనగా ఒక కుండ..’ ఈ ఫ్లాష్ బ్యాక్ మీ జీవితాన్ని మార్చేస్తుంది

A Priest - A Clay Pot :  ఒక పూజారి సంత నుంచి ఓ మట్టికుండను తెచ్చాడు.

  • Written By:
  • Updated On - September 26, 2023 / 10:12 AM IST

A Priest – A Clay Pot :  ఒక పూజారి సంత నుంచి ఓ మట్టికుండను తెచ్చాడు. అందులో నీరు నింపి, ప్రాణ ప్రతిష్ట చేసి, పూజలో ఉంచాడు. పూజలన్నీ పూర్తయ్యాక ఒక సాధువు అక్కడికి వచ్చారు. ప్రాణం వచ్చిన ఆ కుండను ” నీ పూర్వ వృత్తాంతం చెప్పు” అని అడిగారు.

ఆ కుండ ఇలా చెప్పసాగింది..

‘‘మొదట నేనీ భూమి తల్లిలో భాగాన్ని. ఈ అందమైన గ్రహవాసిని. ఓ రోజు ఒక కుమ్మరి వచ్చి గడ్డపారతో నన్ను భూమి తల్లి నుంచి వేరు చేశాడు. చాలా భయంకరమైన అనుభవమది. ఎంతో బాధ కలిగింది. నేను చాలా భయపడిపోయాను. అతడు నన్ను వారి ఇంటికి తీసుకెళ్ళి ఒక మూలన పోశాడు. సరే.. ఇక్కడైనా ప్రశాంతంగా ఉందామనుకుంటే, మరుసటి రోజు అతడు నన్ను సుత్తి తీసుకొని కొట్టాడు. ఎంత నొప్పి అనుభవించానో! నాపై చల్లటి నీళ్లను పోసి, ముద్దగా చేసి వెళ్లిపోయాడు. ఎన్ని జన్మల్లో ఎన్ని పాపాలు చేశానో! అనుకున్నాను. తర్వాత ఆ కుమ్మరివాడు నన్ను ఒక చక్రం పై పెట్టి, ఈ రూపం(కుండ) గా వచ్చేలా మలిచాడు. ఇన్ని బాధలను తట్టుకొని అందమైన కుండగా తయారయ్యాక, భగవంతుడు నన్ను చూసి చిరునవ్వు చిందించాడు. అంతటితో ఆగిపోలేదు. మరుసటి రోజు నుంచి నన్నుకొద్దిరోజుల పాటు ఎండలో ఉంచారు. ఆ తర్వాత నన్ను మంటల్లో పెట్టి కాల్చారు. మూడు రోజులు ఆ మంటల్లో కాలిపోయాను. బయటకు వచ్చాక, నన్ను నేను చూసుకొని ఈ దేహం ఎరుపు రంగులోకి మారడం అగ్నిదేవుడి దయేనని సంతోషించాను. ఆ తర్వాత నన్ను సంతకు తీసుకొచ్చారు. సంతలో అదోరకమైన హింస. నేను కావాలనుకునే ప్రతివారు నన్ను కర్రతో కొట్టి, నా దేహంలో ఏమైనా చిల్లులు ఉన్నాయా, పగుళ్లు ఉన్నాయా అని పరీక్షించే వారు. చివరకు ఈ పూజారి నన్ను కొన్నాడు. గంగ నీటితో నింపి నన్ను పూజిస్తున్నాడు. ఇవాళ జనులు నన్ను చేరి సాగిలా పడుతున్నారు. ఎంత కష్ట పెట్టినా, నేడు ఆ కుమ్మరి దయ వల్లే నేను ఈ స్థితిలో ఉండగలిగాను’’ అని తన పూర్వ వృత్తాంతాన్ని సాధువుకు కుండ (A Priest – A Clay Pot)  వివరించింది.

ఇలాగే గురువు కూడా తన శిష్యుడ్ని వివిధ మార్గాల ద్వారా పరిపూర్ణుడిని చేస్తారు. అతడికి జ్ఞానం ప్రసాదిస్తారు. మానవ జీవిత గమ్యాన్ని చేరే మార్గం వైపు ప్రోత్సహిస్తారు. మోక్షాన్ని ప్రసాదిస్తారు. కానీ కష్టానికి వెరవకుండా సహనంతో ఉండగలిగిన వాడే నిజమైన శిష్యుడు.. ఆ మట్టికుండలాగా పూజార్హుడు. 

గమనిక: ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.