Corona Virus: భ‌య‌పెడుతున్న ఎక్స్‌ఈ వేరియంట్..!

  • Written By:
  • Publish Date - April 4, 2022 / 09:37 AM IST

ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికించిన క‌రోనా వైర‌స్ ఇప్పుడిప్పుడే త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకుంటున్న వేళ‌, చైనాలో కొత్త‌గా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్‌లోని ఎక్స్ఈ వేరియంట్ జ‌నాన్ని భ‌య‌పెడుతోంది. దీంతో ప్ర‌స్తుతం ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ చైనాలో పంజా విసురుతోంది. ఈ క్ర‌మంలో చైనాలో కోవిడ్ కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే చైనాలోని ప‌లు ప్రాంతాల్లో క‌ఠిన‌మైన లాక్‌డౌన్ ఆంక్ష‌లు విధిస్తున్నా వేల సంఖ్య‌లో అక్క‌డి ప్ర‌జ‌లు క‌రోనా బారిన ప‌డుతున్నారు.

ఈ నేప‌ధ్యంలో చైనాలో ఆదివారం ఒక్క‌రోజే దాదాపు 13 వేల‌కు పైగానే క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మ‌రోసారి క‌రోనా మహమ్మారిని కట్టడి చేయలేక చైనా అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈక్ర‌మంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్​ అయిన ఎక్స్​ఈ వేగంగా వ్యాప్తి చెందుతోందని, దీంతో ప్ర‌తి ఒక్క‌రు మాస్కులు తప్పనిసరిగా వాడేల్సిందేనని అక్క‌డి వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ అయిన బీఏ.1, బీఏ.2ల మిశ్రమ‌మే ఎక్స్ఈ వేరియంట్. అయితే బీఏ.2 కంటే ఇది 10 శాతం వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించామ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

దీంతో ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రు మాస్కులు ధరించాలని, మాస్కుల వినియోగంపై నిర్లక్ష్యం వద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మ‌రోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ కొత్త ఎక్స్ఈ వేరియంట్‌తో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఎక్స్ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్ర‌మంలో, చైనాలో గ‌త శ‌నివారం 12 వేల‌కు పైగానే కోవిడ్ కేసులు న‌మోద‌వ‌గా, ఆదివారం 13,146 కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇక కొత్త‌గా న‌మోదైన కేసుల్లో 70శాతం కేసులు షాంఘైలోనే న‌మోద‌య్యాయ‌ని చైనా హెల్త్ క‌మీష‌న్ వెల్ల‌డించింది.

అయితే చైనాలో వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నప్పటికీ మరణాలు మాత్రం సంభవించక‌పోవ‌డం కాస్త ఊర‌ట‌నిస్తుంది. మ‌రోవైపు చైనాలో ప్ర‌తిరోజు వేల సంఖ్య‌లో కోవిడ్ కేసులు న‌మోద‌వుతున్న క్ర‌మంలో అక్క‌డి అధికారులు ఆంక్ష‌లు క‌ఠిన‌త‌రం చేశారు. ఈ క్ర‌మంలో ఈశాన్య చైనాలోని బయాచెంగ్‌లోనూ లాక్‌డౌన్‌ విధించారు. హైనన్‌ ప్రావిన్సులోని సాన్యా నగరానికి వాహన రాకపోకలపై నిషేధం విధించారు. అంతే కాకుండా ఇప్పటికే రెండున్నర కోట్ల జనాభా కలిగిన షాంఘైలో భారీ స్థాయిలో క‌రోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. ఇక చైనాలో మ‌రోసారి క‌రోనా విజృంభిస్తున్న క్ర‌మంలో ఇండియా ముందుగానే అప్ర‌మ‌త్త‌మైంది. ఈ క్ర‌మంలో మాస్కుల‌పై అశ్ర‌ద్ధ వ‌హించొద్ద‌ని దేశంలోని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.