Corona Virus: చైనా ల్యాబ్ నుంచే… కరోనా వైరస్‌ వ్యాప్తిపై యూస్‌ ప్రకటన!

ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి కరోనా వైరస్‌ చైనాలోని ఓ ల్యాబ్‌ లో పుట్టిందని అమెరికాకు చెందిన ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ ఓ రిపోర్టులో వెల్లడించింది. ఈ సంస్థ సేకరించిన సమాచారం

  • Written By:
  • Publish Date - February 27, 2023 / 09:15 PM IST

Corona Virus: ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి కరోనా వైరస్‌ చైనాలోని ఓ ల్యాబ్‌ లో పుట్టిందని అమెరికాకు చెందిన ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ ఓ రిపోర్టులో వెల్లడించింది. ఈ సంస్థ సేకరించిన సమాచారం మేరకు ల్యాబ్‌లోనే కొవిడ్ వైరస్ లీకైందని ఓ నిర్ణయానికి వచ్చినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనంలో ప్రచురించింది. అత్యున్నత స్థాయి నిపుణులు ఉన్నందున ది ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ రిపోర్టు ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికాలోని నేషనల్ ల్యాబ్స్ ను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంటుంది.

అమెరికాకు చెందిన వివిధ డిపార్ట్‌మెంట్లు గతంలో కొవిడ్‌ పుట్టుకపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ కూడా అప్పట్లో కరోనా ఎక్కడ పుట్టిందన్నది నిర్దిష్టంగా చెప్పలేకపోయింది. కానీ తాజాగా ఇచ్చిన 5 పేజీల నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ కూడా గతంలో చైనాలోని ల్యాబ్‌ నుంచి ప్రమాదవశాత్తు వైరస్‌ లీకై ఉంటుందని అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే వాల్‌స్ట్రీట్‌ నివేదికపై స్పందించేందుకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్‌ సులేవాన్‌ నిరాకరించారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఇప్పటికే పలు ఇంటెలిజెన్స్‌ సంస్థలను కొవిడ్‌పై వీలైనంత ఎక్కవ సమాచారం సేకరించాలని సూచించారన్నారు.

చైనాలో సార్స్‌ వైరస్‌ విజృంభించాక 2002లో వుహాన్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేశారు. ఇందులో వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ, చైనీస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌, వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ ప్రొడక్ట్స్‌ తదితర సంస్థలు ఉన్నాయి. ఈ ల్యాబ్కు కొంత దూరంలోని సముద్రజీవుల మార్కెట్‌ను వైరస్‌కు కేంద్రంగా తొలుత భావించారు.