Site icon HashtagU Telugu

COVID – 19 in China : డ్రాగన్‌ కంట్రీలో కోవిడ్ విలయతాండవం

Covid 19 In China

Covid 19 In China

కరోనా (COVID – 19) కాటుకు డ్రాగన్‌ కకావికలమవుతోంది. వేలు కాదు.. లక్షలు కాదు ఏకంగా కోట్లలోనే రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. మహమ్మారి దేశాన్ని కబళిస్తున్నా.. డ్రాగన్ తీరు మారడం లేదు. పాజిటీవ్‌ కేసులు, మరణాల గణాంకాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తోంది జిన్‌పింగ్ ప్రభుత్వం. అసలు చైనాలో వైరస్‌ విజృంభణకు జీరో కోవిడ్‌ పాలసీనే కొంపముంచిందన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం రోజూ కోట్లలో కొత్త కేసులు నమోదవుతున్నాయన్న వార్తలు ప్రపంచదేశాలను హడలెత్తిస్తున్నాయి. డిసెంబరు చివరి వారంలో రోజుకు 3.7 కోట్ల కరోనా కేసులు నమోదయ్యే అవకాశముందని చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ అంచనా వేసింది. గత 20 రోజుల్లో 248 మిలియన్ల మంది కోవిడ్‌ బారినపడినట్లు అంచనా. కరోనా కట్టడికి అవలంబించిన జీరో కొవిడ్‌ పాలసీ వల్ల హెర్డ్‌ ఇమ్యూనిటీ తగ్గి.. వైరస్‌ విలయానికి దారి తీసిందని నిపుణులు చెబుతున్నారు.

క్వింగ్డావో నగరంలో రోజుకు 5 లక్షల మంది కొవిడ్‌ (COVID – 19) బారిన పడుతున్నట్టు సీనియర్ మెడికల్ ఆఫీసర్‌ బో తావో. సంచలన ప్రకటన చేశారు 10 మిలియన్ల జనాభా ఉన్న ఈ సిటీలో వైరస్ వ్యాప్తి పీక్ స్టేజ్‌లో ఉందని వెల్లడించారు. అయితే, ఈ రిపోర్ట్‌ను వెంటనే సెన్సార్ చేసింది చైనా ప్రభుత్వం. కేసుల గణాంకాలను తొలగించింది. ఓవైపు దేశం అల్లాడిపోతుంటే.. కరోనా కేసులు, మరణాలను దాచే ప్రయత్నం చేస్తోంది జిన్‌పింగ్ సర్కార్‌. వాస్తవిక పరిస్థితులు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. వైరస్ బాధితులతో హాస్పిటల్స్ నిండిపోయాయి. శ్మశాన వాటికల్లోనూ క్యూలైన్ ఉంటోంది.

ప్రజాగ్రహంతో ఆంక్షలను సడలించడం వల్ల చైనా వ్యాప్తంగా పీసీఆర్‌ టెస్టింగ్‌ సెంటర్లు మూతపడ్డాయి. దీంతో ఎంత మందికి కరోనా సోకుతోందన్న దానిపై కచ్చితమైన లెక్కలు బయటకి రావడం లేదు. వ్యక్తిగత శ్రద్ధతో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు చేయించుకున్న వారు సైతం పాజిటివ్‌ వస్తే ప్రభుత్వ అధికారులకు చెప్పేందుకు జంకుతున్నారు. దీంతో చైనా ప్రభుత్వం కేసుల లెక్కలు చెప్పడమే మానేసింది.

Also Read:  Sarayu Interview: నిఖిల్ తో వర్క్ చెయ్యడం హ్యాపీగా అనిపించింది – సరయు