ఏది కోవిడ్? ఏది డెంగ్యూ? తెలుసుకోవడం ఎలా?

ఇప్పుడు ఏం చెప్పాలన్నా కోవిడ్ కు ముందు.. కోవిడ్ కు తర్వాత అన్నట్లే చెప్పాల్సి వస్తుంది. అంతకుముందు ఏ జ్వరమొచ్చినా ఏ సాధారణ జ్వరమో లేక సీజనల్ ఫీవరో వచ్చిందని సరిపెట్టుకునేవారు. కానీ ఇప్పుడు ఏ చిన్న ఫీవరొచ్చినా అది కరోనా అనే భయపడుతున్నారు

  • Written By:
  • Publish Date - September 30, 2021 / 03:56 PM IST

ఇప్పుడు ఏం చెప్పాలన్నా కోవిడ్ కు ముందు.. కోవిడ్ కు తర్వాత అన్నట్లే చెప్పాల్సి వస్తుంది. అంతకుముందు ఏ జ్వరమొచ్చినా ఏ సాధారణ జ్వరమో లేక సీజనల్ ఫీవరో వచ్చిందని సరిపెట్టుకునేవారు. కానీ ఇప్పుడు ఏ చిన్న ఫీవరొచ్చినా అది కరోనా అనే భయపడుతున్నారు. దానికి తోడు రోజురోజుకు డెంగ్యూ విజృంభించడంతో మరో కొత్త దిగులు పట్టుకుంది. ఏ లక్షణాలు ఏ వ్యాధివో అవగాహన లేక చివరకు క్రిటికల్ స్టేజ్ కు వెళ్లిపోతున్నారు. అందులోనూ డెంగ్యూ ఫీవర్ అంటే క్షణాల్లో ప్లేట్ లెట్స్ కౌంట్ పడిపోయి ప్రాణాల మీదకు వస్తుంది. దీనికి కారణం ముందుగా కనిపించే లక్షణాలు చూసి కరోనా అనుకుని ఆ టెస్ట్ లు చేయించుకుని అది కాదని తేలాక ఇంకో పరీక్షకు వెళ్లడమే అంటున్నారు డాక్టర్లు. అప్పటికే డెంగ్యూ ఫీవర్ ఎఫెక్ట్ అయి ప్లేట్ లెట్స్ కౌంట్ పడిపోయి ప్రాణాపాయస్థితిలోకి వెళ్లిపోతున్నారు. అందుకే ఏది కోవిడ్, ఏది డెంగ్యూ అనే లక్షణాలపై కాస్త అవగాహన పెంచుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
కోవిడ్ -19 , డెంగ్యూ మధ్య తేడాను ఎలా గుర్తించాలి?
కరోనా ఫీవర్ లో వాసన , రుచి కోల్పోతారు. కానీ డెంగ్యూలో ఇది అస్సలు జరగదు.
కరోనా ఫీవర్ లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. కానీ డెంగ్యూలో అతిసారం ఎక్కువగా కనిపిస్తుంది.
తీవ్రమైన జ్వరం, పొడి దగ్గు, అలసట, గొంతు నొప్పి, కండ్లకలక, తలనొప్పి, శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి కోవిడ్ -19 యొక్క సాధారణ లక్షణాలు. అయితే డెంగ్యూలో కూడా మొదటిగా ఫీవర్ వచ్చినా అది నార్మల్ ఫీవర్ గానే ఉంటుంది.
డెంగ్యూలో సాధారణ జ్వరం ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు
తేలికపాటి జ్వరం , కీళ్లు, కండరాల నొప్పులు, ఒక్కోసారి అధిక జ్వరం, చర్మంపై దద్దుర్లు, తరచుగా వాంతులు, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. అయితే ఈ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకుంటే సాధారణంగా ఒక వారంలో అదృశ్యమవుతాయి.
డెంగ్యూ రక్తస్రావ జ్వరం యొక్క లక్షణాలు
జ్వరంతో పాటు చిగుళ్లు, ముక్కు, నోటిలో రక్తస్రావం, రక్తపు ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోవడం, అంతర్గత రక్తస్రావం, అతిసారం, మూర్ఛలు, చర్మంపై రక్తపు మచ్చలు, తీవ్రమైన జ్వరం, కడుపు నొప్పి. ఇలాంటి లక్షణాలు కన్పిస్తే అర్జంటుగా చికిత్స తీసుకోవాలి. లేదంటే పరిస్థితి ప్రాణాంతకంగా మారవచ్చు.
డెంగ్యూ షాక్ సిండ్రోమ్ యొక్క లక్షణాలు
చివరగా, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అత్యంత తీవ్రమైనది, ప్రాణాంతకమైనది. తక్కువ రక్తపోటు, బలహీనమైన లేదా వేగవంతమైన పల్స్ బీట్, సెరిబ్రల్ అనోక్సియా (మెదడుకు ఆక్సిజన్ అందదు), అధిక రక్తస్రావం, అధిక జ్వరం, వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పితో వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ చేయాలి.
జాగ్రత్తలు..
ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా కూడా ఓ రేంజ్ లో కాకపోయినా రోజూ కొత్త కేసులను మోసుకువస్తూనే ఉంది. దీంతో చాలామంది హాస్పిటల్స్ లో జాయిన్ అవుతున్నారు. వర్షాల వల్ల కూడా సీజనల్ వ్యాధులు ఎక్కువవుతాయి. కానీ తేడా కరోనా, డెంగ్యూల మధ్య తేడాలు తెలుసుకుని వెంటనే చికిత్స తీసుకోకపోతే ప్రాణాల పోయే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. రెండు వ్యాధుల లక్షణాలను కంపేర్ చేసి డాక్టర్ దగ్గరకు వెళ్లి వెంటనే పరీక్షలు చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉండటంతో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలయినంత వరకూ దోమలకు దూరంగా ఉండటం, కాచి వడపోసిన నీళ్లను తాగడం చేస్తే మంచిది. అలాగే ఇటు కరోనా కట్టడికి కోవిడ్ రెండు డోసులు తీసుకోవడం, సామాజిక దూరం పాటించడం, మాస్కులు తప్పని సరిగా పెట్టుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.

Follow us