Covid 19: దేశవ్యాప్తంగా మరోసారి విజృంభిస్తున్న కోవిడ్.. కేంద్ర ప్రభుత్వం అలర్ట్?

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. దేశ వ్యాప్తంగా రోజురోజుకి కోవిడ్ కేసుల సంఖ్య అంతకంతకూ

  • Written By:
  • Publish Date - March 22, 2023 / 07:00 PM IST

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. దేశ వ్యాప్తంగా రోజురోజుకి కోవిడ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కాగా గత నాలుగు రోజులుగా యాక్టివ్‌ కేసులు, పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అదే స్థాయిలో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. గత నాలుగు ఐదు రోజులుగా దాదాపు 1000 కి పైగా కేసులు నమోదు అయ్యాయి. కాగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,03,831 మందికి కరోనా టెస్టులు చేయగా 1,134 మందికి పాజిటివ్‌ గా నిర్దారణ అయ్యింది. అలాగే ఐదుగురు మృతిచెందారు.

తాజా కేసులతో దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,46,98,118 కి చేరినట్టు స్పష్టం చేసింది. కాగా దేశంలో ప్రస్తుతం 7,026 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. గత 24 గంటల్లో ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,813కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 0.02 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే దేశంలో కరోనా యాక్టివ్‌ కేసులు, పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో కోవిడ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ నేడు అనగా బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కోవిడ్‌ నియంత్రణ చర్యలపై సమీక్షించనున్నారు.