రికార్డు స్ధాయిలో వ్యాక్సినేషన్ చేసినా కూడా చైనాలో కరోనా కేసులు రానురాను పెరిగిపోతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన డెల్టా వేరియంట్ తాజా వ్యాప్తికి కారణమని, రానున్న రోజుల్లో మరిన్ని కేసులు పెరుగుతాయని అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అక్టోబర్ 17 నుంచి వారం వ్యవధిలో 11 ప్రావిన్సులకు కరోనావైరస్ వ్యాపించిందని నేషనల్ హెల్త్ కమిషన్ మి ఫెంగ్ వెల్లడించారు. వైరస్ బారిన పడిన వ్యక్తుల్లో చాలా మంది ఇతర ప్రాంతాలకు పర్యటించినట్లు తేలిందన్నారు. దాంతో ప్రభావిత ప్రాంతాలు కఠిన నిబంధనలు అవలంబించాలని సూచించారు. గన్సు, ఇన్నర్ మంగోలియాలోని కొన్ని నగరాలు బస్సు, ట్యాక్సీ సేవల్ని నిలిపివేశాయని రవాణా శాఖకు చెందిన అధికారి వెల్లడించారు. ఈ సోమవారం నుంచి ప్రజలు, పర్యాటకులు ఇళ్లకే పరిమితం కావాలని ఇన్నర్ మంగోలియాలోని ఎజినా అధికారయంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలను ఉపేక్షిస్తే.. చర్యలు తప్పవని హెచ్చరించింది.
శనివారం చైనాలో 26 కొత్త కేసులు వెలుగుచూశాయి. అందులో ఏడు ఇన్నర్ మంగోలియా, ఆరు గన్సు, ఆరు నింగ్జియాలో నమోదు కాగా, బీజింగ్ నాలుగు కేసులు వెలుగుచూశాయి. హబే, హునాన్, షాంగ్జిలో చెరో ఒక కేసు బయటపడింది. వైరస్ కారణంగా అక్టోబర్ 31న జరగాల్సిన మారథాన్‌ను బీజింగ్ ప్రభుత్వం రద్దు చేసింది. వైరస్ కేసులు వెలుగుచూసిన ప్రాంతాల ప్రజలు దేశ రాజధానిలో ప్రవేశించడంపై నిషేధం విధించింది. ఈ మేరకు ఓ వార్తా సంస్థ కథనం పేర్కొంది.
తాజాగా డెల్టా వ్యాప్తి.. ఆర్థిక వ్యవస్థను తిరిగి తెరవాలనే పలు ఆసియా దేశాలకు ఆటంకంగా మారుతోంది. గత 270 రోజుల్లో పూర్తి వ్యాక్సినేషన్ లేక కొవిడ్ నుంచి కోలుకున్న ఉద్యోగులు జనవరి ఒకటి నుంచి కార్యాలయాలకు రావొచ్చంటూ సింగపూర్ శనివారం ప్రకటించింది. అక్కడ ఇప్పటికే 84 శాతం మంది పూర్తి టీకాలు పొందినప్పటికీ.. కేసులు పెరుగుతుండటంతో మరో నెల రోజుల పాటు అక్కడి ప్రభుత్వం కొవిడ్ నిబంధనలను పొడిగించింది.
చైనాలో ఇప్పటివరకు 96,797 కరోనా కేసులు..4,636 మరణాలు సంభవించాయని వరల్డో మీటర్ గణాంకాలు వెల్లడించాయి. టీకా పంపిణీ విషయంలో ఆ దేశం అగ్రస్థానంలో ఉంది. అక్కడ ఇప్పటివరకు దాదాపు 105 కోట్ల మంది పూర్తి స్థాయి టీకా పొందారు.