Covid-19: డ్రాగన్‌పై మళ్ళీ బుసలు కొడుతున్న వైరస్‌!

Covid-19: కరోనా మహమ్మారి డ్రాగన్‌ కంట్రీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మళ్లీ కేసులు భారీగా పెరుగుతున్నాయి.

  • Written By:
  • Updated On - November 1, 2022 / 12:12 PM IST

Covid-19: కరోనా మహమ్మారి డ్రాగన్‌ కంట్రీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మళ్లీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. జీరో కోవిడ్‌ విధానం అమలు చేస్తున్నా.. వైరస్‌ విరుచుకుపడుతూనే ఉంది. రోజువారీ కేసులు 80 రోజుల గరిష్టానికి చేరాయి. ఒక్కరోజే 2 వేల 500 పాజివిట్‌ కేసులు నమోదయ్యాయి. హెనాన్‌ ప్రావిన్స్‌ రాజధాని జెంగ్‌జౌలోని అతిపెద్ద ఐఫోన్‌ ఫ్యాక్టరీ ఫాక్స్‌కాన్‌.. కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. దీంతో ఆ ప్రాంతాన్ని లాక్‌డౌన్‌ చేశారు అధికారులు.

ఓవైపు వైరస్‌, మరోవైపు ఆంక్షలకు భయపడి వందలాది మంది కార్మికులు.. ఫ్యాక్టరీ నుంచి బయటపడేందుకు పరుగులు పెడుతున్నారు. కంచెలు దూకి మరీ పారిపోతున్నారు. రోడ్లపై ట్రెక్కింగ్‌ చేసుకుంటూ.. స్వస్థలాలకు పయనమవుతున్నారు. కాగా.. ప్రపంచంలోని సగం ఐఫోన్‌లు ఈ ఫాక్స్‌కాన్‌లోనే తయారవుతాయి. ఇక్కడ దాదాపు 3 లక్షల మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తారు.

అక్టోబర్‌ 29 నాటికి సెంట్రల్‌ సిటీ ఆఫ్‌ జెంగ్‌జౌలో 167 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కేవలం వారం రోజుల్లోనే 97 కేసులు పెరిగాయి. వైరస్‌ నియంత్రణ కోసం జీరో కోవిడ్‌ విధానాన్ని అమలు చేస్తోంది చైనా ప్రభుత్వం. ఒక్క కేసు వచ్చినా.. ఆ ప్రాంతం మొత్తాన్ని లాక్‌డౌన్‌ చేసేస్తోంది. కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. దీనిపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నా జిన్‌పింగ్ ప్రభుత్వం మాత్రం అసలు వెనక్కి తగ్గడంలేదు.