దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన కేరళను కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. ఒకవైపు దేశ వ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నా, మరోవైపు కేరళలో మాత్రం కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇండియాలో నమోదవుతున్న కేసుల్లో దాదాపు 41 శాతం కరోనా కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలో నమోదవుతున్నాయంటే.. ఆ రాష్ట్రంలో ఏ రేంజ్‌లో కరోనా పంజా విసురుతుందో తెలుస్తుంది.
ఇక దేశ వ్యాప్తంగా నిన్న ఒక్క రోజు కొత్తగా 2,876 కరోనా పాజిటివ్ కేసులు నమోదయితే, ఒక్క కేరళలోనే వెయ్యికి పైగానే కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా పాజిటివ్ రేటు 0.38 శాతం ఉంటే, కేరళలో 4.34 శాతంగా ఉంది. కేరళలో మంగళవారం 27,465 టెస్టులు నిర్వహించగా, 1,193 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా కారణంగా కేరళలో నిన్న 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇక ఇప్పటి వరకు కేరళలో కరోనా కారణంగా దీంతో 66,958 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో 8,064 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న క్రియాశీల కేసుల్లోనూ కేరళలోనే ఎక్కువుగా ఉండడం ఆందోళన కలిగించే విషయమని చెప్పాలి. ఇకపోతే ఈరోజు నుంచి దేశ వ్యాప్తంగా 12–14 ఏళ్ల పిల్లలకూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. 60 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ప్రికాషన్ డోసును ఇవ్వడం మొదలు పెట్టారు.