Site icon HashtagU Telugu

Writer Kulasekhar : టాలీవుడ్ ప్రముఖ లిరిక్ రైటర్ కన్నుమూత

Writer Kulasekhar

Writer Kulasekhar

చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తెలుగు సినీ పాటల రచయిత కులశేఖర్ (Writer Kulasekhar)కన్నుమూశారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం గాంధీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 15, ఆగస్ట్‌ 1971న సింహాచలంలో జన్మించారు. స్కూల్లో ఉన్నప్పుడు పాటలు రాసి బహుమతులు అందుకున్నారు కులశేఖర్‌. తర్వాత జర్నలిస్టుగా కెరీర్‌ మొదలుపెట్టారు. సాహిత్యం మీద ఆసక్తి ఉండడంతో సిరివెన్నెల సీతారామశాస్త్రి దగ్గర శిష్యరికం చేస్తూ సినీ గీతాల రచనలో మెళకువలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ‘చిత్రం’తో లిరిక్ రైటర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఈయన.. జయం, ఘర్షణ, వసంతం, సుబ్బు, నువ్వు నేను ఇలా ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన పాటలు రాసారు. ఇదే క్రమంలో పలు వివాదాల్లో కూడా నిలిచారు.

2013లో కాకినాడలో బాలాత్రిపుర సుందరి అమ్మవారి శఠగోపాన్ని దొంగిలించినందుకుగాను పోలీసులు ఆయన్ని అరెస్ట్‌ చేసి, ఆరు నెలల పాటు జైలు వేశారు. ఆ కేసును విచారించిన పోలీసులు మానసిక స్థితి సరిగా లేదని తెలియజేశారు. తర్వాత వైద్యం కోసం రాజమండ్రికి తరలించారు. గీత రచయితగా బిజీగా ఉన్న సమయంలోనే ‘ప్రేమలేఖ రాశా’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా విడుదలకు చాలా ఆలస్యం కావడం వల్ల మానసికంగా కుంగిపోయారని సన్నిహితులు చెబుతుండేవారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఎవరూ ఆయన్ను పట్టించుకోకపోవడం, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురుకోవడం ఇవ్వన్నీ కూడా ఆయన్ను కుంగదీసాయి. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న చికిత్స పొందుతూ హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం కన్నుమూశారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి మార్చురీలో ఆయన మృతదేహం ఉంది. ఇక కుల‌శేఖ‌ర్ మ‌ర‌ణ‌వార్త తెలుసుకున్న సినీ ప్ర‌ముఖులు ఆయ‌న‌కు సంతాపం తెలియ‌చేస్తున్నారు.

Read Also : NeVa APP: ఏపీ అసెంబ్లీ, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మధ్య కీలక ఒప్పందం