‘మా’లో ఎందుకింత పోటీ..? అసలు రీజన్స్ ఇవే..!

మా ఎన్నికలు ఎన్నడూలేనతంగా వివాదంగా మారాయి.? కేవలం 900 మంది సభ్యులున్న అసోసియేషన్ అసెంబ్లీ ఎన్నికలను ఎందుకు తలపించాయి..?  మా కు రాజకీయ రంగు పులుముకుందా..? ఆధిపత్య ధోరణి కోసం ఇంత హడావుడి చేశారా...? ప్రస్తుతం ఈ ప్రశ్నలు ప్రేక్షకులను కాకుండా సినిమా వాళ్లకు సైతం అంతుబట్టడం లేదు

  • Written By:
  • Updated On - October 11, 2021 / 03:49 PM IST

మా ఎన్నికలు ఎన్నడూలేనతంగా ఎందుకు వివాదానికి దారితీశాయి..? కేవలం 900 మంది సభ్యులున్న అసోసియేషన్ అసెంబ్లీ ఎన్నికలను ఎందుకు తలపించాయి..?  మా కు రాజకీయ రంగు పులుముకుందా..? ఆధిపత్య ధోరణి కోసం రచ్చ రచ్చ చేశారా…? ప్రస్తుతం ఈ ప్రశ్నలు ప్రేక్షకులను కాకుండా సినిమా వాళ్లకు సైతం అంతుబట్టడం లేదు. మూడు నెలల ముందే ఈసారి వేడి రాజుకోవడం విశేషం. ముందుగా ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకోగా.. తర్వాత మంచు విష్ణు లైన్లోకి వచ్చాడు. ఇద్దరు ఒకరినొకరు దూశించుకున్నారు. మాటల యుద్ధాలు నడిచాయి. అయితే ‘మా’ ఎన్నికలపై ఎందుకింత క్రేజు.. వీటిని ప్రముఖులు ఎందుకింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేగానో, ఎంపీగానో ఎంపికైతే అదో పెద్ద హోదా అవుతుంది. డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశముంటుంది. కానీ ‘మా’లో పదవితో ఇలాంటి ప్రయోజనాలేమీ ఉండవు.

చిరుకు చెక్ పెట్టేందుకేనా?

అయితే ఇంతకుముందు అధ్యక్షులుగా కొనసాగిన రాజేంద్ర ప్రసాద్, నరేష్‌లు పెద్దగా సాధించిందేమీ లేదు. సినీ రంగం తరఫున ముఖ్యమైన కార్యకలాపాలన్నీ చిరంజీవి పేరు మీద జరుగుతున్నాయి. దాసరి తర్వాత సినీ పెద్ద స్థానాన్ని ఆయనే భర్తీ చేస్తున్నారు. ఈ విషయం కొంతమంది సినీ పెద్దలకు ఏమాత్రం మింగుడు పడలేదు. మా ఎన్నికల ద్వారా చిరువర్గానికి చెక్ పెట్టాలని భావించారు. మెగా సపోర్ట్ తో రంగంలోకి దిగిన ప్రకాశ్ రాజును ఓడించేందుకు మంచు విష్ణు ప్యానెల్ అనేక ప్రయత్నాలు చేసి చివరకు గెలిచింది.

ప్రాంతీయతత్వం పనిచేసిందా?

మా ఎన్నికల బరిలో ప్రకాశ్ రాజ్ నిలబడుతున్నట్టు ప్రకటించగానే.. ఆపోజిట్ గా ఎవరైనా సీనియర్ నటులు పోటీ చేస్తారని అని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా మంచు ఫ్యామిలీ రంగంలోకి దిగింది. నటులకు లోకల్ నాన్ లోకల్ ఉండదంటూ ప్రకాశ్ రాజ్ మద్దతుదారులు వెనకేసుకొచ్చారు. అయితే మంచు విష్ణు తెలివిగా.. మా అధ్యక్షుడి ఏకగ్రీవాన్ని పెద్దలు తీర్మానిస్తే, తాను సిద్ధంగా ఉన్నట్టు మంచు విష్ణు ప్రకటించి షాక్ ఇచ్చారు. మా భవనాన్ని పూర్తిగా తమ సొంత నిధులతో నిర్మిస్తామని భారీ ఆఫర్ ఇచ్చారు. ప్రకాశ్ రాజ్ కర్ణాటకలో ఓడిపోయారని.. దేశవ్యతిరేకి అంటూ కీలక వ్యాఖ్యలు చేసి.. నామినేషన్ ను వెనక్కి తీసుకున్నాడు ఓ నటుడు. ఈ నేపథ్యంలో ప్రాంతీయతత్వం, జాతీయవాదం కూడా మా ఎన్నికలో కీలకంగా పనిచేసిందని చెప్పక తప్పదు

ఆధిపత్య ధోరణి

మహా అయితే మా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేది 500 మంది ఉండొచ్చు. మా అధ్యక్షుడిగా కన్నా.. సినీ ఇండస్ట్రీకి తాను పెద్ద దిక్కుగా ఉండాలని మంచు విష్ణు భావిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఎక్కడైనా మాట్లాడితే నాన్న గారికంటే గొప్పా అంటూ పదే, పదే చెప్పడంతో మోహన్ బాబును సినీ ఇండస్ట్రీ పెద్దగా చూపించాలని భావిస్తున్నారా అనే అనుమానం కూడా బలంగా వినిపించింది. మా ఎలక్షన్స్ చుట్టూ ఇంత వివాదం జరుగుతున్నా సినీ పెద్దలు ఎందుకు స్పందించడం లేదనే వాదన మొదలైంది. సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండే దాసరి నారాయణ రావు మరణించాకా.. మా మసకబారిపోయిందనేది నగ్న సత్యం. గతంలో ఎలాంటి వివాదమున్నా.. నలుగురిలో చర్చించుకుని నిర్ణయం తీసుకునేవారు. ఇప్పుడు చర్చ కాదు కదా.. రచ్చ రచ్చ చేస్తున్నారు. అయిన ఇండస్ట్రీలో పెద్దలు పెదవి విప్పడం లేదు. కనీసం ఎన్నికల్లో ఓటు వేసేందుకు కూడా కొంతమంది ముందుకు రాకపోవడం గమనార్హం.