Allu Arjuns Uncle : అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇటీవలే తన అల్లుడు బన్నీ అరెస్టుతో ఆయన మనస్థాపానికి గురయ్యారని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్‌ను వీడాలని భావిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడటం అనేది వట్టి ప్రచారం మాత్రమే. దీనిపై ఆయన తరఫున ఎలాంటి అధికారిక ప్రకటన జారీ కాలేదు. అయినప్పటికీ దీనిపై మీడియాలో చర్చ నడుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్‌కు అల్లు అర్జున్ మామ గుడ్‌బై చెబితే.. ఆయన మళ్లీ బీఆర్ఎస్‌లో చేరుతారా ? కొత్తగా బీజేపీలో చేరుతారా ? అనే దానిపై డిస్కషన్ నడుస్తోంది.
తప్పు లేకపోయినా తన అల్లుడు బన్నీని అరెస్ట్ చేశారని, బెయిల్ వచ్చినా కావాలనే ఒక రాత్రి జైలులో ఉంచారని కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈవిధమైన చర్యలతో ఆయన మనస్థాపానికి గురయ్యారని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో ఇంకా కొనసాగితే అవమానం అనే అభిప్రాయంతో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. దీనిపై కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తుపై తదుపరి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందట. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి(Allu Arjuns Uncle) నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో చంద్రశేఖర్ రెడ్డి ఫౌండేషన్ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Also Read :Winter Tour : డిసెంబర్‌లో హిమపాతాన్ని ఆస్వాదించడానికి ఈ 3 హిల్ స్టేషన్‌లకు ట్రిప్ ప్లాన్ చేయండి..!
ఇటీవలే మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ‘‘చిరంజీవితో పాటుగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మా పార్టీలోనే ఉన్నారు. అల్లు అర్జున్‌పై ఎలాంటి కక్ష్య లేదు’’ అని స్పష్టం చేశారు. సీతక్క చెబుతున్న విధంగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నా.. తాజా పరిణామాలతో కొంత బాధకు లోనయ్యారని అంటున్నారు. ‘‘సామాన్యుడి నుంచి ప్రధానమంత్రి వరకు చట్టం ముందు అంతా సమానమే. మా ప్రభుత్వం పొలిటికల్ స్టార్లు, సినిమా స్టార్లూ అనేది చూడదు. తప్పు ఎవరు చేశారనేది మాత్రమే చూస్తుంది’’ అని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు.