సామాజిక అంశాలను కథా వస్తువులుగా తెరకెక్కించే దర్శకుడు దేవ కట్టా (Devakatta) ఓ వెబ్ సిరీస్ (Web Series) తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం YSR, సీఎం చంద్రబాబు స్నేహం గురించి ఈ కథ ఉంటుందని సమాచారం . రాజకీయ నేపథ్యంలో తెరకెక్కే ఈ సిరీస్లో చంద్రబాబు పాత్రలో ఆది పినిశెట్టి, వైఎస్ఆర్ రోల్లో చైతన్య రావు నటిస్తారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Delhi Politics: ఢిల్లీ రాజకీయాల్లో మహిళలదే హవా!
దేవ కట్టా ఇప్పటికే తన దర్శకత్వంలో వచ్చిన ప్రస్థానం (Prasthanam Movie) మూవీ ద్వారా రాజకీయ నేపథ్య కథలను సమర్ధంగా తెరకెక్కించగలడని నిరూపించుకున్నాడు. ఈ సినిమా తన కథ, కథనంతోనే కాకుండా, రాజకీయ చతురత, వ్యక్తుల మానసిక సంఘర్షణలను ప్రదర్శించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. రాజకీయ డ్రామా నేపథ్యంలో రూపొందే ఈ వెబ్ సిరీస్‌లో దేవ కట్టా తన మార్క్ చూపించబోతున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ మేకింగ్ స్టైల్, నేరేషన్, నటీనటుల ఎంపికపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. వెబ్ సిరీస్ ఫార్మాట్‌లో ఈ కథను ఎలా చెప్పబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రను ఆధారంగా చేసుకుని తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ ఎలాంటి వివాదాలను రేకెత్తిస్తుందో చూడాలి.
ఇక చంద్రబాబు – వైస్సార్ స్నేహం – రాజకీయం ప్రస్థానం చూస్తే..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్యం పోటీ, విభేదాలు ఉండటం సహజమే. కానీ, కొన్ని సంబంధాలు రాజకీయాలకు అతీతంగా మైత్రిని, పరస్పర గౌరవాన్ని చాటుతాయి. అలాంటి అరుదైన రాజకీయ బంధాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మధ్య ఉన్న స్నేహం ప్రత్యేకమైనది. వీరిద్దరూ విభిన్న రాజకీయ దారులను అనుసరించినప్పటికీ, రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో మంచి స్నేహితులుగా మెలిగారు.
రాజకీయ ప్రత్యర్థులుగా మారిన స్నేహితులు
చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి 1980 దశకంలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఒకరు తెలుగుదేశం పార్టీ నేతగా, మరొకరు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. రాజకీయం వీరి స్నేహాన్ని దూరం చేసినప్పటికీ, వ్యక్తిగతంగా ఒకరి పట్ల మరొకరికి గౌరవం ఉండేది. 1980లలో వీరి స్నేహం ఉత్సాహంగా కొనసాగగా, 1990లలో రాజకీయ పోటీ పెరిగింది. ముఖ్యమంత్రి పీఠాన్ని సాధించేందుకు జరిగిన కసరత్తులో వీరి మధ్య ప్రత్యర్థిత్వం తీవ్రమైంది. 2004 ఎన్నికల్లో వైఎస్సార్ ఘన విజయం సాధించి సీఎం అవ్వగా, 1995 నుండి 2004 వరకూ సీఎం పదవిని చేపట్టిన చంద్రబాబు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
స్నేహానికి అడ్డురాని రాజకీయ విభేదాలు
వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విభేదాలు గరిష్ట స్థాయికి చేరినప్పటికీ, వ్యతిరేకత వ్యక్తిగత ద్వేషంగా మారలేదు. చంద్రబాబు నాయుడు 2003లో జరిగిన అలిపిరి దాడిలో గాయపడినప్పుడు, వైఎస్సార్ వెంటనే స్పందించి తన రాజకీయ ప్రత్యర్థి ఆరోగ్యంపై ఆరా తీశారు. అలాగే, 2009లో వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు, చంద్రబాబు నాయుడు తన ప్రత్యర్థికి నివాళులర్పించి, కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇలా రాజకీయ విభేదాలు ఎంత తీవ్రంగా ఉన్నా, వ్యక్తిగతంగా గౌరవాన్ని కాపాడుకున్న ఈ ఇద్దరు నేతలు అందరికీ రాజకీయాల్లో మైత్రిని, పరస్పర గౌరవాన్ని ఎలా పాటించాలో చక్కటి ఉదాహరణగా నిలిచారు.