తెలుగు చిత్ర పరిశ్రమ(Tollywood)లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు శుక్రవారం విశాఖపట్నం(Vizag)లో ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. ముఖ్యంగా సినిమా హాళ్ల నిర్వహణ, టికెట్ ధరలు, పర్సంటేజీలు వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ భేటీలో సినీ నిర్మాతలు సి. కళ్యాణ్, స్రవంతి రవికిశోర్, సుధాకర్ రెడ్డి, భరత్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమస్యలపై స్థిరమైన నిర్ణయాలు తీసుకునేందుకు సంఘాల్లోని సభ్యులతో కూడిన జాయింట్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Bayya Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ ఎక్కడ?
సి. కళ్యాణ్ (C Kalyan)మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కో సంఘం నుంచి తొమ్మిది మంది చొప్పున మొత్తం 27 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటవుతుందని తెలిపారు. ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి, ఇండస్ట్రీకి ప్రయోజనకరమైన మార్గాలను సూచించనుంది. త్వరలో ఈ కమిటీ వివరాలు అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. సినిమా హాళ్లలో జరిగే తనిఖీలు, నిర్వహణ అంశాలపై కమిటీ ప్రత్యేక దృష్టి పెట్టనుందని చెప్పారు. ప్రతి నెలా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి పరిశ్రమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కూడా కళ్యాణ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారన్న ఆరోపణలను ఖండిస్తూ “ఆయన మా స్నేహితుడు, గౌరవించిన నాయకుడు, ఆయన చెప్పిన మాటలను మేం స్వాగతిస్తాం కానీ వార్నింగ్‌గా తీసుకోం” అని అన్నారు. థియేటర్లు మూసివేతపై ప్రభుత్వం స్పందించిన తరుణంలో ఇండస్ట్రీ పరంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. థియేటర్ల నిర్వహణ, టికెట్ ధరలు, పన్నులు, తినుబండారాల ధరలు వంటి అంశాలపై దృష్టి పెట్టాలని, వీటన్నింటిని పరిశీలించేందుకు కమిటీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.