Kiran Abbavaram: ప్రేక్షకులందరికీ ‘సమ్మతమే’

కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ "సమ్మతమే".

  • Written By:
  • Publish Date - June 23, 2022 / 01:01 PM IST

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ “సమ్మతమే”. చాందిని చౌదరి కథానాయికగా నటిస్తోంది. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ జూన్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తుంది. తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిధులుగా విచ్చేసిన ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. చిత్ర బృందంతో పాటు మెగా నిర్మాత అల్లు అరవింద్, నిర్మాత బన్నీవాసు, దర్శకుడు సందీప్ రాజ్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ‘సమ్మతమే’ బిగ్ టికెట్ లాంచ్ చేశారు నిర్మాత అల్లు అరవింద్.

ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. సమ్మతమే గీతా ఆర్ట్స్ లో విడుదల చేయడానికి ముఖ్య కారణం.. కిరణ్ మా గీతా ఆర్ట్స్ సొంత మనిషి. కిరణ్ నటుడు గానే కాకుండా మంచి మనిషి గా నాకు అభిమానం వుంది. నేడు ఇండస్ట్రీలో ఒక పెక్యులర్ పరిస్థితిలో వున్నాం. ప్రతి యంగ్ స్టర్ గుండెల్లో చిన్న భయం వుంది. యంగ్ స్టర్ చిన్న సినిమానే తీస్తాడు. చిన్న సినిమాని థియేటర్లో కి వచ్చి చూస్తారా ? అనే భయం వుంటుంది. అటువంటి తరుణంలో గత వారంలో సినిమాలన్నీ విడుదలై ఆ సినిమాలన్నీ భాగా ఆడుతూ థియేటర్లు లేని సందర్భంలో ఈ సినిమా రిలీజ్ కావడం వెనుక కిరణ్ లాంటి యంగ్ స్టర్ పక్కన మనలాంటోళ్ళం నిలబడితే థియేటర్లు దొరుకుతాయని, థియేటర్స్ తీసుకొని బాగా రిలీజ్ చేసేలాగా వుండాలని ముందుకొచ్చి విడుదల చేస్తున్నాం. అలాగే కొడుకు ప్రతిభని గుర్తించి అతను పైకి రావాలని తల్లితండ్రులే రిస్క్ చేయడం నాకు కొత్తకాదు. గోపీనాథ్ తల్లితండ్రులు కూడా ముందుకు వచ్చి ఈ సినిమా చేయడం ఆనందంగా వుంది. చాందిని లక్కీ హ్యాండ్. ఆమె సినిమాలు కూడా బావుంటాయి. టెక్నికల్ టీం అంతటికి అల్ ది బెస్ట్. అందరూ ఎంతో ఉత్సాహంగా తీసిన ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. సినిమా తీయడం ఒక ఛాలెంజ్ అయితే ప్రేక్షకులని థియేటర్ కి రప్పించడం మరో ఛాలెంజ్ గా మారిన పరిస్థితి నెలకొంది. థియేటర్స్ ని కాపాడాల్సిన భాద్యత మనందరిపై వుంది. చిన్నవాడినైనా అందరికీ వేడుకుంటున్నాను. టీవీలో ఓటీటీలో సినిమా చూడొచ్చు కానీ థియేటర్ లో సినిమా చూడటంలో ఓ ఆనందం వుంటుంది. పెళ్లి చేసుకోవడానికి ఇద్దరు వుంటే చాలు. కానీ కళ్యాణ మండపం బుక్ చేసి అందరినీ పిలిచి వైభవంగా పెళ్లి చేసుకుంటాం. అందులో ఒక ఆనందం ఉంటుంది. సినిమాని థియేటర్లో చూడటం కూడా లాంటి ఆనందమే వుంది. నా మొదటి రెండు సినిమాలకి థియేటర్స్ విషయంలో చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఈ సినిమాకి మాత్రం హాయిగా ప్రమోషన్స్ చేసుకొని ఊరూరా తిరిగాను. ఈ విషయంలో నిర్మాత అల్లు అరవింద్, బన్నీ వాసు గారికి రుణపడి వుంటాను. వారితో మాట్లాడితే చాలు ధైర్యంగా వుంటుంది, నాకు ఇంత ధైర్యం ఇచ్చిన వారికి కృతజ్ఞతలు. సమ్మతమే చిత్రం చాలా ప్రశాంతంగా వుంటుంది. ఒక్క ఇబ్బందికరమైన సీన్ కూడా వుండదు. ఫ్యామిలీ కలసి అందరూ ఎంజాయ్ చేస్తారు. థియేటర్ నుండి బయటికి వెళ్ళినపుడు మేము ఒక పాయింట్ చెప్పాం. దాని గురించి ప్రేక్షకులు ఆలోచిస్తారు. ఈ చిత్రానికి పని చేసిన డీవోపీ సతీష్, ఎడిటర్ విప్లవ్ , సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర.. ప్రతి ఒక్కరికి థాంక్స్. చిత్రాన్ని నిర్మించిన ప్రవీణ అమ్మగారికి కృతజ్ఞతలు. చాందిని నేను షార్ట్ ఫిలిమ్స్ నుండి వచ్చాం. ఇద్దరం కలసి ఈ చిత్రం చేయడం ఆనందంగా వుంది. ఎక్కువగా అలోచించవద్దు. కాన్ఫిడెంట్ గా టికెట్ బుక్ చేసుకోండి. సినిమా మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.

దర్శకుడు గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. కథ రాస్తూ దర్శకత్వం వహిస్తూ నిర్మాణం కూడా చేయడం అంత సులువుగా సాధ్యం కాదు. అలా సాధ్యం కావాలంటే మన పాత్రని రీప్లేస్ చెస్తూ ఇంట్లో సపోర్ట్ చేసేవారు వుండాలి. అలా నాకు సపోర్ట్ గా నిలిచింది మా సిస్టర్ సౌమ్య. సమ్మతమే సాధ్యపడిందంటే అది తన వల్లే. దర్శకుడు కావాలనుకున్నపుడు ప్యాషన్ అనేవాడిని. కానీ ప్యాషన్ అనే మాట నిర్మాత మాత్రమే వాడాలని ఈ క్రమంలో తెలుసుకున్నాను. ప్రొడక్షన్ చేయడం అంత తేలికకాదు. నాతో పని చేసిన డీవోపీ సతీష్, ఎడిటర్ విప్లవ్ , సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర.. అందరికీ థాంక్స్. కిరణ్ ప్రతి విషయంలో సపోర్ట్ చేశారు. చాందిని గారితో పని చేయడం ఆనందంగా వుంది. సినిమా చాలా బాగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.

చాందిని చౌదరి మాట్లాడుతూ.. అల్లు అరవింద్ గారి దీవెనలు నాకు లక్కీ చార్మ్ లా అనిపిస్తుంది. కలర్ ఫోటో తర్వాత మరిన్ని మంచి కథలు చేయాలని భావించిన సమయంలో ఎంపిక చేసుకున్న మరో అద్భుతమైన కథ సమ్మతమే. ఒక మంచి పాత్రని ఇచ్చిన గోపీనాథ్ గారికి థాంక్స్. కిరణ్ తో పని చేయడం ఆనందంగా అనిపించింది. శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ కి ఫ్యాన్ నేను. ఈ చిత్రం కోసం అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. సమ్మతమే గీతా ఆర్ట్స్ లో విడుదల కావడం మాటల్లో చెప్పలేని ఆనందం ఇస్తుంది. ఇలాంటి గొప్ప అవకాశం వచ్చినందుకు సంతోషంగా వుంది. మా నిర్మాత ప్రవీణ గారు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డీవోపీ సతీష్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. మిగతా టెక్నికల్ టీం అంతటికి థాంక్స్. ఈ చిత్రాన్ని 24న థియేటర్ లో చూసి సమ్మతమే అనాలని కోరుకుంటున్నాను. ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా ఇది. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులు తప్పకుండ నచ్చే సినిమా సమ్మతమే” అన్నారు.

నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. కిరణ్, గోపి ఒక ఏడాదిగా నాతో ప్రయాణం మొదలుపెట్టారు. జులై 1న మా సొంత సినిమా ‘ పక్కా కమర్షియల్’ విడుదలకు వుండగా ‘సమ్మతమే’ ని ఎందుకు విడుదల చేస్తున్నారని చాలా మంది అడిగారు. దీనికి రెండు కారణాలు. ఒక యంగ్ టీం మంచి కథతో సినిమాని తయరు చేశారు. ఈ రోజుల్లో ఒక చిన్న, మీడియం సినిమాని విడుదల చేయడానికి చాలా గట్స్ కావాలి. థియేటర్ లో మనుపటి పరిస్థితి లేవు. ఇలాంటి సమయంలో నన్ను కలిసి సినిమా చూడండి నచ్చితే సపోర్ట్ చేయమని అడిగినప్పుడు సినిమా చూడటం జరిగింది. చాలా మంచి సినిమా ఎలాగైనా జనాల్లోకి తీసుకెళ్లాలని నిర్మాత అరవింద్ గారిని అడిగాను. ఏ సినిమా నిర్మాత కూడా తన సినిమా వారంలో విడుదల పెట్టుకొని మరో సినిమాకి తన థియేటర్లు ఇచ్చి ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళే నిర్మాత చాలా అరుదుగా వుంటారు. ఈ విషయంలో అరవింద్ గారికి హాట్స్ ఆఫ్ చెప్పాలి. చిన్న వాళ్ళని, యంగ్ ట్యాలెంట్ ని ఆశిర్వదించాలని ఆయన తీసుకున్న నిర్ణయానికి హాట్స్ ఆఫ్. నాకు ఇష్టమైన వ్యక్తుల్లో కిరణ్ ఒకరు. ఆయనకి ఇండస్ట్రీలో మంచి భవిష్యత్ వుండాలి. మా తరుపు నుండి పూర్తి సపోర్ట్ వుంటుంది. చాందిని గారి కలర్ ఫోటో నేనే రిలీజ్ చేశాను. సమ్మతమేలో కూడా చాందిని గారు అద్భుతంగా నటించారు. ఈ చిత్రాన్ని నిర్మించిన దర్శకుడు గోపినాద్ గారి తల్లితండ్రులు ప్రవీణ వెంకట్ గారికి అభినందనలు. గోపినాద్ కి మంచి భవిష్యత్ వుంది. చాలా సన్నివేశాలు అద్భుతంగా తీశారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని అందరూ చూసే విధంగా ‘సమ్మతమే’ అనే టైటిల్ పెట్టడం సంతోషించదగ్గ విషయం. దర్శకుడు గోపీనాథ్, నిర్మాత ప్రవీణ వెంకట్ రెడ్డి, కిరణ్ అబ్బవరం, చాందిని .. టీం అంతటికి అభినందనలు. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు చిత్ర పరిశ్రమకు పూర్తి స్థాయి ప్రోత్సాహన్ని అందిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ స్టామినా నేడు విశ్వవ్యాప్తమైయింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప చిత్రాలు రికార్డులు సృష్టించాయి. యూత్ ట్యాలెంట్ అంతా కలసి సమ్మతమే అనే మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న గోపీనాథ్ కు అభినందనలు. హీరో కిరణ్ అబ్బవరం కి ఈ చిత్రంతో మరింత పేరు వస్తుంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ విడుదల చేయడం అదృష్టం కలిసొస్తుందని నమ్ముతున్నాను. అల్లు అరవింద్ గారు ఆషామాషీ సినిమాలు చేసే నిర్మాత కాదు. ఈ చిత్రం సూపర్ హిట్ కావాలి. భవిష్యత్ లో ప్రవీణ ,వెంకట్ రెడ్డి గారి నిర్మాణంలో మరిన్ని సినిమాలు రావాలి” కోరుకుంటున్నాను” అన్నారు