Puri Jagannadh : టాలీవుడ్ లో ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్టులు, బ్లాక్ బస్టర్స్ ని అందించిన మాస్ డైరెక్టర్ పూరీజగన్నాధ్.. ఇప్పుడు సరైన హిట్ ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నారు. కేవలం హీరోల పాత్ర పైనే సినిమాని నడిపిస్తూ, పంచ్ డైలాగ్స్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన పూరి పెన్‌కి.. ప్రస్తుతం పదును తగ్గింది. పూరి నుంచి చివరిగా వచ్చిన ఒక మంచి సినిమా అంటే టెంపర్. ఆ తరువాత వచ్చిన ఇస్మార్ట్ శంకర్.. పూరి రేంజ్ లో లేకపోయినా పరవాలేదు అనిపించింది. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న లైగర్ మూవీ అయితే.. పూరి కెరీర్ లోనే ఒక బ్లాక్ మార్క్ గా మిగిలిపోయింది.
ఒకప్పటి పూరి సినిమాలు అంటే.. ప్లాప్ అయినా జనాలకు నచ్చేవి, రిపీట్ ఆడియన్స్ కూడా ఉండేవారు. కానీ ఇప్పుడు హిట్ టాక్ తెచ్చుకున్నా సినిమాలు కూడా ఆడియన్స్ పై పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాయి. దీంతో పూరి అభిమానులు బాగా నిరాశ చెందుతున్నారు. పూరి మ్యాజిక్ కావాలంటూ జనరల్ ఆడియన్స్ తో పాటు సెలబ్రిటీ ఆడియన్స్ కూడా విన్నపాలు పెడుతున్నారు. ఈక్రమంలోనే రాజమౌళి తండ్రి, స్టార్ రైటర్ అయిన విజయేంద్ర ప్రసాద్ కూడా పూరికి విన్నవించుకున్నారట. విజయేంద్ర ప్రసాద్ కి పూరీజగన్నాధ్ అంటే ఎంతో అభిమానం అని అందరికి తెలుసు.
పూరి ఫోటోని తన ఫోన్ వాల్ పేపర్ గా పెట్టుకున్నట్లు విజయేంద్ర ప్రసాద్ గతంలో చూపించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఆయన అభిమానం అక్కడితో ఆగిపోలేదు. ప్రస్తుతం వరుస ప్లాప్స్ ఎదురుకుంటున్న పూరిని చూసి చాలా బాధ పడిపోతున్నారు. లైగర్ ప్లాప్ తరువాత పూరీజగన్నాధ్ కి విజయేంద్ర ప్రసాద్ ఫోన్ కాల్ చేసి ఇలా అన్నారట.. “మీలాంటి దర్శకుడు ఇలా ప్లాప్స్ ఇవ్వడం నేను చూడలేకపోతున్నాను. నాకు ఒక సహాయం చేయండి. మీరు కొత్త సినిమా చేసేటప్పుడు ఆ కథని ఒకసారి నాకు వినిపించండి. దానిలో ఏమైనా తప్పులుంటే చెబుతాను” అని రిక్వెస్ట్ చేసారంట.
ఆ మాటలకి పూరి బాగా ఎమోషనల్ అయ్యారంట. అందుకనే ఈసారి ఎలాగైనా సరైన హిట్ కొట్టాలని డబల్ ఇస్మార్ట్ స్క్రిప్ట్ ని జాగ్రత్తగా రాసినట్లు చెప్పుకొచ్చారు. అయితే విజయేంద్ర ప్రసాద్ అడిగినట్లు ఆ కథని ఆయనికి వినిపించలేదట. మరి ఈ సినిమాతో పూరి హిట్ కొడతాడా లేదా చూడాలి. ఆగష్టు 15న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.