టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) డెంగ్యూ(Dengue fever)తో బాధపడుతూ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ నెల 20వ తేదీన డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ, ఈ విషయంపై ఆయన కుటుంబ సభ్యులు కానీ, వ్యక్తిగత టీమ్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. విజయ్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తుంది.
విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం కింగ్‌డమ్ ఈ నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సీతార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూనర్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమా పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కినట్లు చిత్ర బృందం చెబుతోంది. అయితే ముందుగా మార్చి 30న విడుదల కావాల్సిన ఈ సినిమా, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం వల్ల వాయిదా పడింది.
Revanth Alleges : అర్ధరాత్రి లోకేష్ తో కేటీఆర్ మంతనాలు – రేవంత్ సంచలన వ్యాఖ్యలు
విజయ్ మిగతా సినీ ప్రాజెక్టుల విషయానికొస్తే.. బాలీవుడ్‌లో ఓసినిమాకు సిద్ధమవుతున్నట్లు టాక్ నడుస్తోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న ఫర్హాన్ అక్తర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న డాన్ 3 సినిమాలో విలన్ పాత్ర కోసం విజయ్ దేవరకొండను ఎంపిక చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విక్రాంత్ మాసే స్థానంలో విజయ్ కు అవకాశం దక్కినట్లు సమాచారం. అలాగే కింగ్‌డమ్ సినిమా హిందీ వెర్షన్‌ను నేరుగా నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌పై విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తానికైతే విజయ్ దేవరకొండ హాస్పటల్ లో ఉన్నాడనే వార్త చిత్రసీమను ఖంగారు పెడుతుంది.