Venkaiah Naidu : ఇటీవల చాలా సినిమాల్లో హీరోలు నెగిటివ్ పాత్రల్లోనే కనిపిస్తున్నారు. నరుక్కోవడాలు, కాల్చుకోవడాలు ఎక్కువయిపోయాయి సినిమాల్లో. రక్తపాతమే మాస్ అనుకుంటున్నారు. పుష్ప సినిమాలో స్మగ్లింగ్ చేసే పాత్రను హీరోగా చూపించారు. సినిమా హిట్ అయినా అది ఇప్పటి జనరేషన్ పై చాలా ప్రభావం చూపిస్తుంది. అలాంటి సంఘటనలు కూడా చెప్పి పలువురు వాపోతున్నారు. తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇలాంటి సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేసారు.
అలనాటి నటి, నిర్మాత, గాయని కృష్ణవేణి ఇటీవల మరణించారు. ఆమె సంస్మరణ సభలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె గురించి మాట్లాడిన అనంతరం ఇప్పటి సినిమాల గురించి మాట్లాడారు.
వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ఇప్పటి సినిమాల్లో ద్వంద్వార్థాలు ఉన్న డైలాగ్స్ కామన్ అయిపోయాయి. ఇప్పటి రచయితలకు నేనిచ్చే సలహా ఒక్కటే. అర్థవంతంగా మాటలు రాయండి చాలు. ద్వంద్వార్థాలు పెట్టాల్సిన పనిలేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ గారి హయాంలో అప్పట్లో మంచి సినిమాలు చాలా వచ్చాయి. అవి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. అప్పటి సినిమాల గురించి ఇప్పుడు కూడా గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పటి సినిమాల్లో ప్రతినాయక పాత్రల్నే హీరోలుగా మారుస్తున్నారు. అలాంటివి పిల్లల ముందు పెట్టకూడదు. అది హీరోయిజం అనిపించుకోదు. హాస్యంలో కూడా అశ్లీలత ఉండే పదాలు వాడుతున్నారు. సినిమా వ్యాపారం మాత్రమే కాదు అది ఒక కళాత్మక సందేశం కూడా. ప్రజలకు మంచిని తెలియచేసి సంతోషం, మానసిక ఉల్లాసం ఇవ్వడమే సినిమా లక్ష్యం కావాలి అన్నారు.
దీంతో వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇటీవల ఆల్మోస్ట్ హీరోలంతా నెగిటివ్ పాత్రల్లోనే నటిస్తూ హీరోయిజం చూపిస్తున్నారు. ఇది ఇప్పటి జనరేషన్ పిల్లలపై చాలా ప్రభావం చూపిస్తుంది.మరి ఇలాంటి సినిమాలు ఎప్పుడు ఆగుతాయో చూడాలి.
Also Read : Oscars 2025 : ఆస్కార్ అవార్డుల్లో ‘వికెడ్’, ‘అనోరా’ హవా.. విజేతలు వీరే