Site icon HashtagU Telugu

Varalaxmi: వరలక్ష్మీ శరత్ కుమార్ బహుభాషా చిత్రం ‘శబరి’ ప్రారంభం

Sabari

Sabari

ఎటువంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటి వరలక్ష్మీ శరత్ కుమార్. ‘క్రాక్’లో నెగెటివ్ రోల్ చేసి మెప్పించారు. ‘నాంది’లో న్యాయవాదిగా ఆకట్టుకున్నారు. ఒక ఇమేజ్‌కు, భాషకు పరిమితం కాకుండా వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆమెకు అభిమానులు ఉన్నారు. వాళ్ళ ముందుకు మరో సరికొత్త పాత్రతో రావడానికి వరలక్ష్మీ శరత్ కుమార్ సిద్ధమయ్యారు. వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శబరి’. మహా మూవీస్ పతాకంపై మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతోంది. పూజా కార్యక్రమాలతో నిరాడంబరంగా ఈ రోజు చిత్రాన్ని ప్రారంభించారు.

ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు మదన్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, నిర్మాత ‘నాంది’ సతీష్ వేగేశ్న క్లాప్ ఇచ్చారు. సీనియర్ దర్శకులు బి. గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. సీనియర్ నిర్మాత పోకూరి బాబూరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినిమా ప్రారంభమైన సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. దర్శకుడు అనిల్ కాట్జ్ మాట్లాడుతూ “క్రైమ్ నేపథ్యంలో రూపొందిస్తున్న ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర చిత్రానికి ప్రధాన ఆకర్షణ. గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, ప్రభు తదితరులు ఇతర తారాగణం. గోపిసుందర్ స్వరాలు చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ. టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ తో దర్శకుడిగా నా తొలి సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాత మహేంద్రనాథ్ గారికి థాంక్స్” అని అన్నారు. చిత్రనిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ “వరలక్ష్మీ శరత్ కుమార్ గారు ఇంతకు ముందు ఎప్పుడూ చూడని కొత్త పాత్ర ‘శబరి’లో చేస్తున్నారు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. కథ, కథనాలు సరికొత్తగా ఉంటాయి. ఈ నెల 11 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. హైదరాబాద్, విశాఖ, కొడైకెనాల్ వంటి అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ చేస్తాం” అని చెప్పారు.

నటీనటులు:
వరలక్ష్మీ శరత్ కుమార్, గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, ప్రభు, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, కామాక్షి భాస్కర్ల, ‘రచ్చ’ రవి, బేబీ నివేక్ష, బేబీ కృతిక, ‘వైవా’ రాఘవ, హరిశ్చంద్ర తదితరులు ఈ చిత్రంలో తారాగణం.

Exit mobile version