ఉన్ని ముకుందన్(Unni Mukundan) ప్రస్తుతం మలయాళం(Malayalam)లో స్టార్ హీరో. గతంలో తెలుగులో జనతా గ్యారేజ్(Janatha Garriage) సినిమాతో పరిచయమయ్యాడు. అనంతరం భాగమతి, ఖిలాడీ, యశోద.. లాంటి పలు తెలుగు సినిమాల్లో కనిపించాడు. ఇటీవల మలయాళంలో వచ్చిన మాలికాపురం(Malikapuram) సినిమాతో భారీ హిట్ కొట్టాడు ఉన్ని ముకుందన్. తాజాగా ముకుందన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
నరేంద్ర మోదీ ప్రస్తుతం కేరళ పర్యటనలో ఉన్నారు. కేరళలో పలు ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేరళలోని పలువురు ప్రముఖులను మోదీని కలిశారు. ఈ క్రమంలోనే ఉన్ని ముకుందన్ కూడా మోదీని కలిశారు. అయితే ఉన్ని ముకుందన్ తో ఏకంగా 45 నిముషాలు ఏకాంతంగా మోదీ మాట్లాడటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
మోదీ భేటీ అనంతరం ముకుందన్ మోదీతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నా 20 ఏళ్ళ కల నెరవేరింది. నేను మలయాళీ అయినా చిన్నప్పుడు గుజరాత్ లో పెరిగాను. నాకు 14 ఏళ్ళు ఉన్నప్పటినుంచి మిమ్మల్ని కలవాలనుకున్నాను. అప్పట్నుంచి మోదీ గారంటే చాలా ఇష్టం. మోదీ గారిని ఒక్కసారైనా కలవాలి, ఆయనతో మాట్లాడాలి అని కోరుకునేవాడ్ని. ఆ కల ఇన్నాళ్లకు తీరింది. మిమ్మల్ని కలిసి, మీతో గుజరాతీలో మాట్లాడాను. ఆయన నాతో 45 నిముషాలు మాట్లాడారు. నా లైఫ్ లోనే అత్యంత విలువైన 45 నిమిషాలు ఇవి. మీరు చెప్పిన సూచనలు ఎప్పటికి మర్చిపోలేను అని అన్నారు.