Ukraine: షూటింగ్స్ కు అడ్డా.. ‘ఉక్రెయిన్’ గడ్డ!

ఉక్రెయిన్.. పేరుకే చిన్నదేశం. కానీ మంచి విద్యావిధానం, అందమైన టూరిజం ప్రాంతాలు, దర్శనీయమైన స్థలాలున్న ప్రాంతంగా పేరుంది. అందుకే ఇతర దేశాల చిత్రాలతో పాటు, భారతదేశ చిత్రాలు సైతం ఆ దేశంలో షూటింగ్స్ జరుపుకుంటాయి.

  • Written By:
  • Updated On - March 2, 2022 / 03:21 PM IST

ఉక్రెయిన్.. పేరుకే చిన్నదేశం. కానీ మంచి విద్యావిధానం, అందమైన టూరిజం ప్రాంతాలు, దర్శనీయమైన స్థలాలున్న ప్రాంతంగా పేరుంది. అందుకే ఇతర దేశాల చిత్రాలతో పాటు, భారతదేశ చిత్రాలు సైతం ఆ దేశంలో షూటింగ్స్ జరుపుకుంటాయి. దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం సైతం అక్కడే షూటింగ్ జరుపుకుందంటే.. ఉక్రెయిన్ కంట్రీకి ఉన్న ప్రాధాన్యం ఏమిటో ఇట్టే తెలిసిపోతోంది. RRR, 99 పాటలు, దేవ్, విజేత సినిమాలతోపాటు అనేక భారతీయ సినిమాలు, సిరీస్‌లు ఉక్రెయిన్‌లోని వివిధ ప్రదేశాలలో చిత్రీకరించబడ్డాయి. లొకేషన్ మేనేజర్లు, ప్రొడక్షన్ అసిస్టెంట్లు మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా ఉక్రెయిన్ భారతీయ సినిమాలకు గమ్యస్థానంగా మారుతోంది. ఎందుకంటే ఇక్కడ తక్కువ ఖర్చుతో సుందరమైన ప్రదేశాల్లో షూట్ చేసుకునే వీలుంది. ఇతర తూర్పు యూరోపియన్ దేశాల కంటే 20-30% చౌకగా ఉంటుంది.

తమిళం, తెలుగు, హిందీ చిత్రాల కోసం విదేశాల్లో షూటింగ్‌లు నిర్వహించే లొకేషన్ మేనేజర్ నటరాజన్ రామ్‌జీ మాట్లాడుతూ.. “భారతీయ చిత్ర నిర్మాతలకు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే  నిర్మాణ సంస్థలకు షూటింగ్ పరంగా కూడా ఉక్రెయిన్ అత్యంత అనుకూలమైన ప్రదేశం. నటులు. అక్కడి లొకేషన్‌లు పారిస్, లండన్, యుఎస్, ఇండియా లొకేషన్స్ కు ఏమాత్రం తీసిపోవు. అంతేకాదు.. అక్కడి ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు శీతాకాలం ఎక్కువగా ఉంటుంది. మే నుంచి అక్కడ కొన్ని షూట్‌లను ప్లాన్ చేశాం. డిసెంబర్‌లో ఉక్రెయిన్‌లో చిత్రీకరించిన ‘శరవణన్ అరుల్’ ఊర్వశి రౌతేలా నటించిన పేరులేని తమిళ చిత్రం షూటింగ్స్ జరుపుకున్నాయి. ఈ చిత్రాలకు సంబంధించిన మరికొన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించాల్సి ఉంది’’ అని చెప్పారు.

ఉక్రెయిన్‌లో చిత్రీకరించిన చిత్రాల్లో కార్తీ, రకుల్ ప్రీత్‌ల దేవ్‌ సినిమా కూడా ఉంది. ఉక్రెయిన్‌లో షూట్‌లను కోఆర్డినేట్ చేసే ఇండో-సోవియట్ ఫిల్మ్స్ డైరెక్టర్ సతీష్ శర్మ మాట్లాడుతూ మేం ఉక్రెయిన్‌లో చాలా ప్రాజెక్ట్ లు చేస్తున్నాం. నిజానికి, గణేష్ ఆచార్య దర్శకత్వంలో తదుపరి ప్రాజెక్ట్ మార్షల్ మేలో ఉక్రెయిన్‌లో చిత్రీకరించాల్సి ఉంది. కానీ ఇప్పుడు అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. కోవిడ్ తీవ్రతరం దాల్చిన సమయంలో ఉక్రెయిన్ లో చాలా చిత్రాలు తెరకెక్కాయని అన్నారు.