Site icon HashtagU Telugu

Bheemla Nayak: పగతో జ’గన్’ సర్కార్.. ప్రేమ చాటుకున్న ‘కేసీఆర్’

jagan bheemla nayak pawan kcr

jagan bheemla nayak pawan kcr

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భీమ్లానాయక్‌’.సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి మాటలు, స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. భారీ బడ్జెట్ తో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సూర్యదేవకర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈనెల 25న తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఓవర్సీస్ మార్కెట్ లో నేడు(గురువారం) ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా… పవన్ నటించిన ‘భీమ్లా నాయక్’ ఫీవరే నెలకొంది. మరోవైపు చూస్తే… ఓ రేంజ్ లో సినిమా వచ్చిందనే టాక్ నడుస్తోంది. పవన్ ‘భీమ్లా నాయక్’ తో మరోసారి ‘పవర్ తుఫాన్’ చూపించబోతున్నాడని నిర్మాత ఎంతో ధీమాగా ఉన్నాడు.

పవన్ పై పగ తీర్చుకుంటున్న జ’గన్’ ప్రభుత్వం:

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ మూవీ విడుదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ లోని థియేటర్లకు జగన్ సర్కార్ ముందస్తు నోటీసులు జారీ చేసింది. ‘భీమ్లా నాయక్’ కు సంబంధించిన బెనిఫిట్‌ షోలు, అదనపు షోలు వేయరాదని ఆదేశాలు జారీ చేసింది.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని, టికెట్‌ ధరలు ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండాలని నోటీసులో పేర్కొంది. సినిమా హాళ్ల వద్ద రెవెన్యూ అధికారుల నిఘా ఉంటుందని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సినిమాటోగ్రఫీ చట్టం 1952 ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసులో వెల్లడించింది వైసీపీ ప్రభుత్వం.

ఈమేరకు అన్ని జిల్లాల్లో తహసీల్దార్లు వారి పరిధిలోని థియేటర్లకు నోటీసులు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని థియేటర్లలో….మరుగుదొడ్ల నిర్వహణ, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. విశాఖ జిల్లా అనకాపల్లి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోనూ..పరిస్థితి ఇలాగే ఉంది. ఈ రకంగా మరోసారి పవన్ పై జగన్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

‘వకీల్ సాబ్’ సినిమా విషయంలోనూ టికెట్ ధరలను తగ్గించారని వారు గుర్తుచేసుకుంటున్నారు. జగన్ ప్రభుత్వం ఏం చేసినా… భయపడేది లేదని… ‘భీమ్లా నాయక్’ కలెక్షన్ల సునామీ ఖాయమని పవన్ ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు.

పవన్ ఫ్యాన్స్ కు తెలంగాణ గుడ్ న్యూస్:

తెలంగాణ వ్యాప్తంగా ‘భీమ్లానాయక్‌’ ఐదో ఆటకు కేసీఆర్ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 11వ తేదీ వరకూ… అంటే రెండు వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి థియేటర్‌ లోనూ ఐదో ఆటను ప్రదర్శించుకోవచ్చు. ప్రభుత్వ నిర్ణయం పట్ల పవన్‌ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘వకీల్‌సాబ్‌’ తర్వాత పవన్‌ నటిస్తున్న చిత్రం కావడంతో భీమ్లా నాయక్ పై అంచనాలు ఆకాశాన్నంటాయి.

అభిమానుల అంచనాలను అందుకునేలా ఉంటుందని… ‘భీమ్లా నాయక్’ లో పవన్ నట విశ్వరూపం చూస్తారని చిత్ర యూనిట్ ధీమాగా చెప్పుకుంటుంది. మరి ‘భీమ్లా నాయక్’ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సునామీ వసూళ్లను సాధిస్తుందో అన్నది వేచి చూడాలి.