Chandu : తెలుగు టీవీ సీరియల్స్ తో మంచి గుర్తింపుని సంపాదించుకున్న ‘చంద్రకాంత్’.. ఆత్మహత్య చేసుకొని మరణించారు. చంద్రకాంత్ కి పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ కుటుంబ విభేదాలతో ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారు. చందు ఆత్మహత్య చేసుకోవడం పై అతని భార్య శిల్ప స్పందించారు. తన వెంటపడి మరి చందు తనని ప్రేమ వివాహం చేసుకున్నారని, వారి ప్రేమకి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని.. ఆమె చెప్పుకొచ్చారు.
అయితే కొంతకాలం క్రిందట ‘త్రినయని’ సీరియల్ కి సైన్ చేసిన తరువాత తమ ప్రేమ జీవితానికి ఆటంకం కలిగిందని ఆమె పేర్కొన్నారు. ఆ సీరియల్ తో నటి ‘పవిత్ర జయరాం’తో చందుకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో చందు.. తనని, పిల్లల్ని వదిలేసి పవిత్రతో అయిదేళ్లుగా సహజీవనం చేస్తూ వస్తున్నారని శిల్పా తెలియజేసారు. అప్పటినుంచి తాను చందుతో మాట్లాడడం లేదని పేర్కొన్నారు.
ఇక ఇటీవల పవిత్ర మరణించడంతో.. ఆమె పై విపరీతమైన ప్రేమ పెంచుకున్న చందు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. మూడు రోజుల క్రితం చెయ్యి కూడా కోసుకున్నారట. నిన్న తన ఇన్‌స్టాగ్రామ్ లో చందు.. “పవిత్ర నీ దగ్గరికి వస్తున్నా” అంటూ రాసుకొచ్చారట. అది చూసిన శిల్పా కుటుంబసభ్యులు చందుకి ఫోన్ చేసారు. కానీ చందు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో శిల్పా ఫ్యామిలీ తమకి తెలిసిన వాళ్ళని చందు ఇంటికి పంపించి చూడగా.. చందు ఆత్మహత్య చేసుకొని కనిపించారు.
పెళ్లి అయ్యాక కూడా వేరే వారితో కొనసాగించే సంబంధాలు చాలా మంది జీవితాలను నాశనం చేస్తున్నాయని, ఇప్పుడు తమ జీవితాన్ని కూడా నాశనం చేసిందని, తనకి తన పిల్లలకి న్యాయం జరిగేలా చూడాలని శిల్పా అభ్యర్ధించారు. కాగా పవిత్ర జయరాం మే 12న రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ సమయంలో పవిత్రతో పాటు చందు కూడా కారులో ఉన్నారు. ఆ ప్రమాదం నుంచి కేవలం గాయాలతో బయటపడ్డ చంద్రకాంత్.. మానసికంగా చాలా దెబ్బతిని ఇలా ఆత్మహత్యకి పాల్పడ్డారు.