Toxic: కన్నడ సూపర్ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ విడుదల తేదీలో కీలక మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రకటించినట్లుగా ఈ చిత్రాన్ని జూన్ 4, 2026న విడుదల చేయాల్సి ఉండగా అంతర్జాతీయ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని చిత్రబృందం ఈ తేదీని వాయిదా వేసింది. ఇటీవల జరిగిన సినిమాకాన్ ఈవెంట్‌లో ఈ చిత్రానికి సంబంధించి ఇచ్చిన ప్రజెంటేషన్‌కు అంతర్జాతీయ పంపిణీదారులు, విదేశీ చిత్ర పరిశ్రమ భాగస్వాముల నుండి అద్భుతమైన స్పందన రావడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని కేవలం ప్రాంతీయ చిత్రంగా కాకుండా ఒక గ్లోబల్ ప్రాజెక్ట్‌గా విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం చిత్రబృందం వివిధ దేశాల్లో పంపిణీ ఒప్పందాలను కుదుర్చుకోవడం, గ్లోబల్ ప్రమోషన్స్ వ్యూహాలను సిద్ధం చేయడంపై దృష్టి సారించింది. యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ సంయుక్తంగా అందించిన ఈ కథపై అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ క్రేజ్ నెలకొనడంతో అన్ని భాషల్లోనూ ఏకకాలంలో సమన్వయంతో కూడిన విడుదలను ప్లాన్ చేస్తున్నారు. యష్ కూడా తన ప్రకటనలో ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ‘టాక్సిక్’ సినిమాకు గ్లోబల్ స్థాయిలో దక్కాల్సిన గౌరవం, గుర్తింపు దక్కాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై పెంచే బాధ్యత నటుడిగా, నిర్మాతగా తనపై ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Also Read: ఐపీఎల్ 2026.. ఆ జట్టు కెప్టెన్‌పై కఠిన చర్యలు!
నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తార సుతారియా వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రాన్ని కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో నేరుగా చిత్రీకరించారు. దీనితో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లోకి అనువదించి భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. సినిమా కోసం ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది కొంచెం నిరాశ కలిగించే విషయమే అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప సినిమా అనుభూతిని అందించడమే తమ ప్రాధాన్యతని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఉండే సరికొత్త విడుదల తేదీని చిత్రబృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.
