Site icon HashtagU Telugu

Tollywood Strike : చిరంజీవిని కలవబోతున్న టాలీవుడ్ నిర్మాతలు

Chiranjeevi

Chiranjeevi

తెలుగు సినీ పరిశ్రమ(Tollywood)లో వేతనాల పెంపు విషయంలో నెలకొన్న వివాదం తీవ్రరూపం దాలుస్తోంది. 30% వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సమ్మెకు పిలుపునివ్వడంతో షూటింగ్‌లు నిలిచిపోయాయి. దీనిపై నిర్మాతలు గట్టిగా స్పందిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల స్థాయిలో వేతనాలు ఇస్తున్నప్పటికీ ఇంకా గొంతెమ్మ కోరికలు కోరడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. దీంతో సమస్యను పరిష్కరించేందుకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రత్యామ్నాయాల కోసం నిర్మాతల ప్రకటన

సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రొడ్యూసర్స్ గిల్డ్ అనుభవం, ప్రతిభ కలిగిన కొత్త టెక్నీషియన్లను ఆహ్వానిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మేకప్, ఆర్ట్, ప్రొడక్షన్ వంటి అనేక విభాగాల్లో పనిచేయడానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది సమ్మెతో తమ డిమాండ్లు నెరవేరతాయని ధీమాతో ఉన్న ఫెడరేషన్‌కు షాక్‌లాంటిది. తాము కార్మికులు లేకుండా కూడా పని చేయగలమని నిర్మాతలు చెప్పకనే చెబుతున్నారు.

సమస్య పరిష్కారానికి చిరంజీవి మధ్యవర్తిత్వం?

ఈ సమస్య వల్ల షూటింగ్‌లు ఆగిపోవడం వల్ల రోజుకు కోట్లాది రూపాయల నష్టం జరుగుతోంది. నటుల కాల్షీట్లు వృథా అవడం, పరికరాల అద్దెలు అదనపు భారంగా మారడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి మెగాస్టార్ చిరంజీవి మధ్యవర్తిత్వం వహించాలని కోరుతూ నిర్మాతలు ఆయనను కలవనున్నట్లు సమాచారం. మరోవైపు పీపుల్స్ మీడియా సంస్థ షూటింగ్‌లను అడ్డుకుంటే కోట్ల రూపాయల నష్టం వస్తుందని, దానికి బాధ్యత వహించాల్సి వస్తుందని ఫెడరేషన్‌కు నోటీసులు పంపింది.

US : అమెరికాలో వీసా గడువు దాటితే శిక్షలు..భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక

Exit mobile version