Rama Navami : టాలీవుడ్‌లో రాముడిగా కనిపించిన నటులు వీరే..

తెలుగు ఆడియన్స్ కి రాముడు అంటే ముందుగా ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. కానీ ఎన్టీఆర్ కంటే ముందు ఆ తరువాత కూడా తెలుగు తెరపై చాలామంది రాములవారు కనిపించారు.

  • Written By:
  • Publish Date - April 17, 2024 / 01:04 PM IST

Rama Navami : నేడు శ్రీరామనవమి పండుగ కావడంతో దేశమంతటా రామనామం వినిపిస్తుంది. ఇక ఈ పండుగ సందర్భంగా మన టాలీవుడ్ లో రాముడిగా కనిపించిన నటులు ఎవరో ఒకసారి చూసేద్దాం. తెలుగు ఆడియన్స్ కి రాముడు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్. ఆ పాత్రని ఆయన అంత ఓన్ చేసుకున్నారు. అయితే ఎన్టీఆర్ కంటే ముందు ఆ తరువాత కూడా తెలుగు తెరపై చాలామంది రాములవారు కనిపించారు. వారెవరు ఈ ఆర్టికల్ చూసి తెలుసుకోండి.

తెలుగు తెరపై తొలి రాముడిగా కనిపించిన నటుడు అంటే యడవల్లి సూర్యనారాయణ. 1932లో తెరకెక్కిన ‘పాదుకా పట్టాభిషేకం’ సినిమాలో యడవల్లి రాముడిగా కనిపించారు. బాదామి సర్వోత్తం డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగులో రెండో టాకీ చిత్రంగా రూపిందింది. ఎన్టీఆర్ కంటే ముందే అక్కినేని రాముడి పాత్రలో కనిపించారు. 1944లో అక్కినేని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా ‘శ్రీ సీతారామ జననం’. ఈ సినిమాలో ఏఎన్నార్ రాముడిగా నటించి టాలీవుడ్ రెండో రాముడు అయ్యారు.

ఆ తరువాత 1945 లో కడారు నాగభూషణం దర్శకనిర్మాణంలో తెరకెక్కిన ‘పాదుకా పట్టాభిషేకం’ సినిమాలో సి ఎస్ ఆర్ ఆంజనేయులు రాముడిగా కనిపించారు. వీరి తరువాత టాలీవుడ్ నాలుగో రాముడిగా ఎన్టీఆర్ కనిపించారు. 1959లో సంపూర్ణ రామాయణం సినిమాలో మొదటిసారి రాముడిగా కనిపించి ఆకట్టుకున్న ఎన్టీఆర్.. ఆ తరువాత లవకుశ, రామదాసు, శ్రీరామాంజనేయ యుద్ధం సినిమాల్లో రాముడిగా మెప్పించి ప్రేక్షకుల గుండెల్లో రాముడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.

ఇక 1961లో ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామ కల్యాణం సినిమాలో ఎన్టీఆర్ రావణుడిగా కనిపించగా, ‘హరనాథ్‌’ రాముడిగా నటించారు. ఈ సినిమా తరువాత హరనాథ్‌.. 1969 లో వచ్చిన ‘శ్రీరామకథ’ సినిమాలో కూడా రాముడిగా కనిపించారు. ఈయన తరువాత 1968లో ‘వీరాంజనేయ’ సినిమాలో కాంతారావు రాముడిగా నటించారు. ఆ తరువాత 1971లో బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంపూర్ణ రామాయణం’లో శోభన్‌బాబు రాముడిగా కనిపించి ఆకట్టుకున్నారు.

ఈ చిత్రం తరువాత 1976లో బాపు దర్శకత్వంలోనే తెరకెక్కిన ‘సీతా కల్యాణం’లో రవికుమార్‌ రాముడిగా కనిపించారు. ఈ సినిమాల తరువాత మళ్ళీ దశాబ్దాల పటు వెండితెర పై రాముడి పాత్ర కనిపించలేదు. 1997లో జూనియర్‌ ఎన్టీఆర్ ని రాముడిగా చూపిస్తూ గుణశేఖర్ ‘బాల రామాయణం’ తీసుకు వచ్చారు. ఆ తరువాత 2000లో కోడిరామకృష్ణ డైరెక్ట్ చేసిన ‘దేవుళ్ళు’ సినిమాలో శ్రీకాంత్.. ఒక సాంగ్ లో కొత్తసేపు రాముడిగా కనిపించి ఆకట్టుకున్నారు.

2006లో నాగార్జున ‘శ్రీరామదాసు’ సినిమాలో సుమన్ రాముడిగా కనిపించారు. ఆ తరువాత 2011 లో బాలకృష్ణ ‘శ్రీ రామరాజ్యం’ చిత్రంలో రాముడిగా కనిపించి మెప్పించారు. ఇక చివరిగా ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించారు. మరి రానున్న రోజులు ఇంకెంతమంది రాముడిగా దర్శనం ఇవ్వనున్నారో చూడాలి.

Also read : Ananya Nagalla : రాముడి గుడి కట్టడం కోసం తాత పదేళ్ల పోరాటం.. హీరోయిన్‌తో గొడవ..