టాలీవుడ్‌లో సినీ కార్మికుల సమ్మె పదిహేనో రోజుకు చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. కార్మిక సంఘాలు, నిర్మాతల మండలికి మధ్య కొనసాగుతున్న చర్చలు ఇంకా ఏకాభిప్రాయానికి రాకపోవడంతో సమ్మె కొనసాగుతోంది. ఈ రోజు కూడా రెండు పక్షాల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినప్పటికీ స్పష్టమైన పరిష్కారం దొరకలేదు. అయితే ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) జోక్యం చేసుకోవడం సినీ పరిశ్రమలో ప్రాధాన్యతను సంతరించుకుంది.
చిరంజీవి నివాసంలో కార్మిక సంఘాల (Film Federation Members ) నుంచి దాదాపు డెబ్బై మంది ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. ప్రతి విభాగం సమస్యలను ఆయన వ్యక్తిగతంగా అడిగి తెలుసుకున్నారని సమాచారం. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను, కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలను ఫిల్మ్ ఛాంబర్ ముఖ్యులతో త్వరలో చర్చించనున్నారు. ఈ పరిణామం వల్ల కార్మికులకు, నిర్మాతలకు ఒక కొత్త ఆశ కలిగింది.
అంతకుముందు నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్‌లో అత్యవసర సమావేశం నిర్వహించారు. దిల్ రాజు, సి.కళ్యాణ్, నాగ వంశీ, బోగవల్లి బాపినీడు, చదలవాడ శ్రీనివాసరావు వంటి ప్రముఖులు హాజరై సమస్య పరిష్కార బాధ్యతను ఛాంబర్‌కి అప్పగించినట్లు తెలిపారు. ఇప్పుడు ఛాంబర్ తీసుకునే నిర్ణయం తుది నిర్ణయంగా మారనుండడంతో, చిరంజీవి ఆధ్వర్యంలో జరగబోయే చర్చలే అత్యంత కీలకంగా మారాయి. మొత్తానికి, చిరు ఎంట్రీతో సినీ పరిశ్రమలో నెలకొన్న ఈ సమ్మె త్వరలో ముగుస్తుందనే ఆశలు పెరిగాయి.