Site icon HashtagU Telugu

Akkineni Nageswara Rao: నేడు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి.. వంద సంవత్సరాల అందగాడు ఏఎన్నార్..!

Akkineni Nageswara Rao

Compressjpeg.online 1280x720 Image (1) 11zon

Akkineni Nageswara Rao: తెలుగు సినీ పరిశ్రమకు ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) రెండు కళ్లలాంటివాళ్ళు. ఎన్నో సినిమాలతో ప్రేక్షకులని మెప్పించి తెలుగు వారి మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 20 సెప్టెంబర్ 1924 కృష్ణ జిల్లాలోని ఓ గ్రామంలో పుట్టిన అక్కినేని నాగేశ్వరరావు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగి హైదరాబాద్ కి సినీ పరిశ్రమకు తరలించిన వారిలో ముఖ్యులుగా నిలిచి అన్నపూర్ణ స్టూడియోస్ ని స్థాపించి ఎన్నో సినిమాలకు, ఎంతోమందికి అవకాశాలు కల్పించి తెలుగు సినీ పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోయారు. వచ్చే సంవత్సరం ఆయన 100వ జయంతి కావడంతో ఈ సంవత్సరం నేడు ఆయన పుట్టిన రోజు నుంచి శత జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు.

గుడివాడ దగ్గర రామాపురం అనే ఓ చిన్న గ్రామంలో పుట్టిన ఏఎన్నార్ చదువు అవ్వగానే సినిమాలంటూనే బయలుదేరారు. 1941లో ధర్మపత్ని అనే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఓ చిన్న పాత్ర చేశారు. అనంతరం 1944లో శ్రీ సీతారామ జననం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. బాలరాజు, కీలు గుర్రం, లైలా మజ్ను సినిమాలతో నాగేశ్వరరావు హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం వరుసగా సెకండ్ హీరోగా, హీరోగా రోల్స్ చేసుకుంటూ వచ్చారు. ఎన్టీఆర్ తో కలిసి పల్లెటూరి పిల్ల, మిస్సమ్మ, గుండమ్మ కథ, మాయాబజార్, భూకైలాస్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అక్కినేని చేసిన దేవదాస్, ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం సినిమాలు ఒక క్లాసిక్ మూవీస్ గా నిలిచిపోయాయి.

Also Read: Allu Arjun Statue: మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో అల్లు అర్జున్‌ విగ్రహం..!

పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్.. మూడు దేశ అత్యున్నత అవార్డులు అందుకున్న ఏకైక తెలుగు నటుడు అక్కినేని. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, నంది అవార్డులు, ఎన్టీఆర్ అవార్డు, ఫిలిం ఫేర్ అవార్డులు, ఇంకా ఎన్నో ప్రైవేట్ అవార్డులు గెలుచుకున్నారు. ఏడు దశాబ్దాల సినీ జీవితంలో ఏఎన్నార్ ఎన్నో బిరుదులు పొందారు. మరెన్నో అవార్డులు అందుకున్నారు. చలన చిత్ర రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును 1991లో అందుకున్నారు. ఆయన అందుకున్న బిరుదుల్లో ‘నట సార్వభౌమ’, ‘నట రాజశేఖర’, ‘కళాప్రవీణ’, ‘అభినయ నవరస సుధాకర’, ‘కళా శిరోమణి’, ‘అభినయ కళాప్రపూర్ణ’, ‘భారతమాత ముద్దుబిడ్డ’ వంటివి ఉన్నాయి.

ఇవి కాకుండా ఆంధ్ర విశ్వవిద్యాలయం, నాగార్జున విశ్వవిద్యాలయం, దక్షిణ భారత హిందీ ప్రచారసభ నుంచి గౌరవ డాక్టరేట్‌లు అందుకున్నారు. అక్కినేని భారతీయ చలన చిత్ర రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2010లో సుబ్బరామిరెడ్డి మిలీనియం అవార్డును కూడా అందుకున్నారు. అలాగే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) నుంచి జీవిత సాఫల్య పురస్కారాన్ని (2012) పొందారు. ఏఎన్నార్ 2014 జనవరి 22న తన 91వ ఏటా కన్నుమూశారు.