Citadel Honey Bunny : స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ జంటగా నటించిన ‘సిటాడెల్ : హనీ బన్నీ’ వెబ్ సిరీస్‌పై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఇది మొత్తం ఆరు భాగాలుగా విడుదల కానుండగా.. మొదటి భాగం నవంబరు 6న అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా రిలీజైంది. ఈ వెబ్ సిరీస్ మొదటి పార్ట్‌లో ఒక కోటను చూపించారు. ఆ కోటలో చాలా సీన్లను చిత్రీకరించారు. తుపాకులతో కాల్పులు జరుపుకునే ఒక సీన్‌ను కోట ప్రాంగణంలోనే షూట్ చేశారు. ఈనేపథ్యంలో ఆ కోట ఎక్కడిది ? అనే దానిపై సినీ ప్రియుల నడుమ డిస్కషన్ నడుస్తోంది. ఈ కోట రాజస్థాన్‌లోనిది అని కొందరు అంటుంటే.. ఆ కోట అక్కడిది కాదు అని మరికొందరు వాదిస్తున్నారు. ఇంతకీ ఈ కోట ఎక్కడుందో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
Also Read :Gabbar Singh : ‘గబ్బర్ సింగ్’ అమ్జద్ ఖాన్ జయంతి.. విలన్ పాత్రతో హీరో ఇమేజ్
దతియా నగరం ఘన చరిత్ర
‘సిటాడెల్ : హనీ బన్నీ’ వెబ్ సిరీస్‌లో చూపించిన ఆ కోట(Citadel Honey Bunny) హిందూ ఆర్కిటెక్చర్‌తో అద్భుతంగా ఉంది. అయితే దానిపై ఇస్లామిక్ నిర్మాణ శైలిలో మినారెట్లు, గుమ్మటాలు కూడా ఉన్నాయి. అంటే.. హిందూ, ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ల కలయికగా ఈ కోటను నిర్మించారు. ఇంతకీ ఎందుకలా నిర్మించారు ? అసలు ఈ కోట ఎక్కడిది ? అనేది అంచనా వేసే విషయంలో చాలామంది తప్పులో కాలు వేస్తున్నారు. సిసలైన సమాధానం ఏమిటంటే.. ఘన చరిత్రకు సాక్ష్యంగా నిలిచే ఈ కోట మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దతియా నగరంలో ఉంది. దతియాకు మరో పేరు దైత్య వక్ర. మహాభారత కాలంలో ఈ నగరాన్ని దంతవక్రుడు అనే రాజు పాలించాడు. అందుకే దతియాకు దైత్య వక్ర అనే పేరు కూడా వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. దతియా నగరం అనేది ప్రస్తుతం జిల్లా కేంద్రం. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరం నుంచి 71 కి.మీ దూరంలో దతియా నగరం ఉంది. చాలామంది పర్యాటకులు గ్వాలియర్ మీదుగా దతియాకు వస్తుంటారు.
Also Read :Tata Group Invest In AP: ఏపీకి టాటా గ్రూప్ స్వీట్ న్యూస్.. టీసీఎస్ మాత్రమే కాదు, అంతకు మించి??
మొఘల్ చక్రవర్తి జహంగీర్ మెప్పు కోసం..
దతియా కోటను ‘సిటాడెల్ : హనీ బన్నీ’ వెబ్ సిరీస్‌లో అద్భుతంగా చూపించారు. ఈ కోట లోపల 7 అంతస్తులు ఉన్నాయి. హిందూ, ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ల కలయికగా ఈ కోటను నిర్మించడానికి ఒక బలమైన కారణం ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఓర్ఛా రాజ్యాన్ని వీర్ సింగ్ దేవ్ పాలించిన టైంలో.. దతియా నగరం కూడా దాని పరిధిలోనే ఉండేది. 1605 నుంచి 1627 వరకు ఓర్ఛా రాజ్యాన్ని ఆయన ఏలాడు. ఆ టైంలోనే దతియాలో ఈ కోటను వీర్ సింగ్ దేవ్ కట్టించారు. మొఘల్ పాలకులకు సామంత రాజుగా వీర్ సింగ్ దేవ్ ఉండేవాడు. తాను దతియాకు వస్తున్నానని ఒకసారి మొఘల్ చక్రవర్తి జహంగీర్ నుంచి వీర్ సింగ్ దేవ్‌కు సందేశం వచ్చింది. దీంతో జహంగీర్ వసతి కోసం దతియాలో ఈ భారీ కోటను ఆయన కట్టించారు. దీని నిర్మాణ పనులు 1614 సంవత్సరంలో జరిగాయి. చక్రవర్తి జహంగీర్ మెప్పును పొందేందుకు దతియా కోటపై ఇస్లామిక్ శైలిలో గుమ్మటాలు, మినారెట్లను వీర్ సింగ్ దేవ్ ఏర్పాటు చేయించారు. మొఘల్ చక్రవర్తి అక్బర్‌కు, ఆయన కుమారుడు సలీమ్‌కు మధ్య రాజ్యాధికారం కోసం ఘర్షణ తలెత్తిన టైంలోనూ వీర్ సింగ్ దేవ్ కీలక పాత్ర పోషించాడు. అక్బర్‌పై సలీమ్ గెలిచేందుకు అవసరమైన అన్ని రకాల సాయాన్ని అందజేశాడు. ఎట్టకేలకు మొఘల్ సామ్రాజ్యపు నాలుగో చక్రవర్తిగా సలీమ్ అవతరించారు. అతడు 1605 నుంచి 1627 వరకు మొఘల్ చక్రవర్తిగా వ్యవహరించాడు. తనకు సాయం చేసినందుకుగానూ వీర్ సింగ్ దేవ్‌కు ‘మహారాజా’ (గ్రేట్ కింగ్) అనే బిరుదును సలీమ్ ఇచ్చారు.