The Raja Saab: మలయాళీ ముద్దుగుమ్మలు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కించిన హారర్ ఫాంటసీ ఎంటర్టైనర్ ‘ది రాజా సాబ్’. ఈ సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో చిత్ర యూనిట్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోలకు అనుమతినిస్తూ ప్రభుత్వం కొత్త జీవోను జారీ చేసింది.
పెయిడ్ ప్రీమియర్ షోలు, టికెట్ ధరలు
తాజా జీవో ప్రకారం.. రేపు (జనవరి 8న) జరగనున్న పెయిడ్ ప్రీమియర్ షోల కోసం టికెట్ ధరను గరిష్టంగా రూ. 1000 వరకు నిర్ణయించుకునేందుకు ప్రభుత్వం మేకర్స్‌కు అనుమతి ఇచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమాకు ఈ నిర్ణయం పెద్ద ప్లస్ కానుంది. కేవలం ప్రీమియర్ షోల ద్వారానే భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది.
Also Read: గ్రీన్ ల్యాండ్‌పై ట్రంప్ చూపు.. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలకు అర్థం ఇదేనా?!
సాధారణ ప్రదర్శనల రేట్లు (జనవరి 9 నుండి)
జనవరి 9 నుండి ప్రారంభమయ్యే సాధారణ ప్రదర్శనల కోసం కూడా ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సింగిల్ స్క్రీన్స్‌లో సాధారణ టికెట్ ధరపై రూ. 150 అదనంగా పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. దీనివల్ల సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర రూ. 297గా ఉండబోతోంది. మల్టీప్లెక్స్‌ల్లో ఇక్కడ సాధారణ ధరపై రూ. 200 పెంచుకోవచ్చు. దీనితో మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధర రూ. 377కి చేరుకుంటుంది. ఈ పెరిగిన ధరలు సినిమా విడుదలైన మొదటి పది రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అంతటా వర్తిస్తాయి. అలాగే రోజుకు ఐదు ప్రదర్శనలు ప్రదర్శించుకునేందుకు కూడా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల అంచనా
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, సాంగ్స్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. ఇప్పుడు ప్రభుత్వ అనుమతితో టికెట్ ధరలు పెరగడం, అదనపు షోలు లభించడంతో ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సంక్రాంతి సీజన్ కావడంతో ప్రేక్షకులు కూడా ఈ హారర్ కామెడీ విజువల్ వండర్‌ను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
