Vikrant Massey: క్షమాపణలు చెప్పిన నటుడు.. హిందువులను బాధ పెట్టడం తన ఉద్దేశం కాదంటూ?

  • Written By:
  • Publish Date - February 22, 2024 / 11:30 AM IST

నటుడు విక్రాంత్ మస్సే గురించి మనందరికీ తెలిసిందే. ఇటీవల విడుదల అయిన 12 ఫెయిల్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు విక్రాంత్. ఈ సినిమాకు విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించడంతోపాటు నటుడు విక్రాంత్ కి మంచి గుర్తింపు కూడా దక్కింది. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు విక్రాంత్. అంతేకాకుండా ఈ సినిమాల్లో నటనకు గాను పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు సైతం అందుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా నటుడు విక్రాంత్ క్షమాపణలు తెలిపారు.

అసలేం జరిగింది? విక్రాంత్ క్షమాపణలు ఎందుకు చెప్పారు అన్న వివరాల్లోకి వెళితే.. కాగా విక్రాంత్ మస్సే 2018 లో తను చేసిన వివాదాస్పద ట్వీట్‌కు రీసెంట్‌గా సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పారు. సీతారామ భక్తులపై వ్యాఖ్యానిస్తున్నట్లు చూపించే ఎడిటోరియల్ కార్టూన్‌ను జోడించి 2018 లో విక్రాంత్ మస్సే ఒక ట్వీట్ చేసారు. అది షేర్ చేసిన తర్వాత అనేకమంది విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. రీసెంట్‌గా ఆ పోస్టును తొలగించిన విక్రాంత్ సోషల్ మీడియాలో క్షమాపణలు కోరుతూ పోస్ట్ పెట్టారు. 2018 నాటి నా ట్వీట్ గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. హిందూ సమాజాన్ని బాధపెట్టడం లేదా కించపరచడం లేదా అగౌరవ పరచడం నా ఉద్దేశం కాదు. కానీ హాస్యాస్పదంగా నేను చేసిన ట్వీట్ గురించి ఆలోచించినప్పుడు దాని అంతరార్ధాన్ని కూడా గ్రహించాను.

 

వార్తాపత్రికలో ప్రచురించబడిన కార్టూన్‌ను జోడించకుండా కూడా ఇదే విషయాన్ని చెప్పవచ్చు. నేను అన్ని మతాలు, విశ్వాసాల పట్ల గౌరవభావంతో ఉన్నాను. నా ట్వీట్ వల్ల ఎవరి మనసైనా గాయపడి ఉంటే ప్రతి ఒక్కరికీ క్షమాపణ చెబుతున్నాను. మనమంతా కాలంతో పాటు మారతాము. మన తప్పులు మనం గ్రహిస్తాం. ఇది నా తప్పు, క్షమించండి అంటూ విక్రాంత్ మస్సే క్షమాపణలు తెలిపారు. ముంబయికి చెందిన లాయర్ అశుతోష్ దూబే విక్రాంత్ మస్సేతో చేసిన చాట్ స్క్రీన్ షాట్ ఆన్ లైన్‌లో పంచుకున్న తర్వాత విక్రాంత్ సోషల్ మీడియాలో క్షమాపణలు కోరారు. ప్రస్తుతం విక్రాంత్ ట్వీట్ వైరల్ అవుతోంది.