No Film Shootings: టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్‌

కరోనా కారణంగా గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

  • Written By:
  • Updated On - July 31, 2022 / 11:00 PM IST

కరోనా కారణంగా గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ధియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడం, చిన్న, మీడియం బడ్జెట్‌ సినిమాలు ఓటీటీల్లో రెండు, మూడు వారాలకే స్ట్రీమింగ్‌ అవుతుండటంతో పాటు స్టార్ హీరోల రెమ్యూనరేషన్ హద్దులు దాటడం వంటి కారణాలు సినిమా బడ్జెట్‌ కంట్రోల్‌ చేయలేని విధంగా పరిస్థితులు మారాయి.

దీంతో చాలా రోజులుగా నిర్మాతలు చిత్ర నిర్మాణం పరంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలు పరిష్కరించుకునేందుకు ఆగస్టు 1నుంచి షూటింగ్స్‌ నిలిపివేయాలని ఫిలిం చాంబర్‌ నిర్ణయం తీసుకుంది. గిల్డ్‌ నిర్ణయానికి ఫిలిం చాంబర్‌ మద్దతు తెలిపింది. కొత్త సినిమాలే కాదు, చివరి దశలో ఉన్న సినిమాల షూటింగ్స్‌ బంద్‌ చేయనున్నారు.

ఇప్పటికే జరుగుతున్న సినిమా షూటింగ్‌లు కూడా ఆగిపోనున్నాయి. ప్రస్తుతం చాలా సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవాళ జరిగిన ఫిల్మ్ ఛాంబర్ జనరల్ బాడీ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. షూటింగ్స్ బంద్‌పై నిర్మాతలంతా ఏకతాటిపైకి వచ్చారని దిల్‌ రాజు చెప్పారు. సమస్యలపై లోతుగా చర్చించి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఎప్పటి నుంచి మళ్ళీ షూటింగ్స్ ప్రారంభించేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

కొద్ది రోజుల పాటు షూటింగ్‌లు నిలిపేస్తున్నట్లు ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడు బసిరెడ్డి వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి కొంత సమయం కావాలనీ, కొద్ది రోజులు షూటింగ్‌లు ఆపాలని నిర్ణయించినట్టు తెలిపారు. పరిష్కారం దొరికే వరకు బంద్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. సినిమాల బడ్జెట్‌ పెరిగిపోతుండటం, అదే సమయంలో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌.. ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే ఫిలిం ఛాంబర్‌ నూతన అధ్యక్షుడిగా బసిరెడ్డి ఎన్నికయ్యారు. ఆయన 22 ఓట్లతో కొల్లి రామకృష్ణపై విజయం సాధించారు.