Telugu Directors : ఇప్పటి తెలుగు దర్శకులు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన సినిమాలు తెలుసా?

అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సమయంలో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి స్క్రీన్ పై కనిపించారు. మరి ఆ దర్శకులు ఎవరు..?

  • Written By:
  • Publish Date - January 6, 2024 / 11:00 PM IST

ప్రస్తుతం టాలీవుడ్(Tollywood) లో అగ్ర దర్శకులుగా రాణిస్తున్న వారు ఒక్కప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ గా ఒకరి దగ్గర పని చేసిన వారే. అలా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సమయంలో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి స్క్రీన్ పై కనిపించారు. మరి ఆ దర్శకులు ఎవరు..? ఆ సినిమాలు ఏంటి..? అనేవి ఒక లుక్ వేసేయండి.

ప్రస్తుతం ప్రభాస్ తో ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘కల్కి’ని డైరెక్ట్ చేస్తున్న దర్శకుడు ‘నాగ్ అశ్విన్'(Nag Ashwin). ఈ డైరెక్టర్ కెరీర్ మొదటిలో శేఖర్ కమ్ముల దగ్గర శిష్యరికం చేశారు. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో హీరోలు క్రికెట్ ఆడుతున్న సీన్ లో ఒక ప్లేయర్ గా నాగ్ అశ్విన్ కనిపిస్తారు.

అలాగే కెరీర్ లో ఒక్క ప్లాప్ కూడా లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi). హీరో గోపీచంద్ సినిమాలో కనిపించారు. 2008లో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘శౌర్యం’ సినిమాలో అనిల్ రావిపూడి హోటల్ రిసెప్షనిస్ట్ గా కనిపిస్తారు. ఈ సినిమాకి అనిల్ రచయితగా పనిచేశారు.

ఇక మహర్షి, వరిసు వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి(Vamshi Paidipalli).. ప్రభాస్ ని హీరోగా నిలబెట్టిన ‘వర్షం’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించారు. ప్రభాస్, త్రిష కలిసి బస్సులో వెళ్తున్న సీన్ లో ఒక పాసెంజర్ గా వంశీ పైడిపల్లి కనిపించారు.

ప్రస్తుతం బాలీవుడ్ కి వెళ్లేందుకు సిద్దమవుతున్న దర్శకుడు గోపీచంద్ మలినేని(Gopichand Malineni).. చిరంజీవి ‘స్టాలిన్’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించారు. ఆ సినిమాలో చేతులు లేని ఓ మహిళా స్టూడెంట్ తనకి సహాయం చేయమని అడిగే సీన్ అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. అలా అడిగిన వారిలో మలినేని కూడా ఉంటారు.

ప్రెజెంట్ యానిమల్ మూవీతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న సందీప్ వంగ(Sandeep Vanga).. తన కెరీర్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన ఒకే ఒక సినిమా నాగార్జున ‘కేడి’. ఆ సినిమాలో నడి సముద్రంలో కోస్టల్ పోలిసుల చేత షూట్ చేసి చంపబడే వ్యక్తిగా సందీప్ వంగ కనిపిస్తారు.

అలాగే అల్లు అర్జున్ ‘ఆర్య’ సినిమాలో హీరో హీరోయిన్ ఫోటోని కాలేజీ నోటీసు బోర్డులో పెట్టిన సన్నివేశంలో.. హీరోయిన్ ని కామెంట్ చేసే పాత్రలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల(Sreekanth Addala) కనిపిస్తారు.

ఇక మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar).. చిరంజీవి ‘అందరివాడు’ సినిమాలో ఛానల్ లో పని చేసే వ్యక్తిగా కనిపిస్తారు. ఈ చిత్రం కంటే ముందు తరుణ్ నటించిన ‘నిన్నే ఇష్టపడ్డాను’ సినిమాలో స్టూడెంట్ గా కూడా కనిపిస్తారు.

వీరితో పాటు మరికొంతమంది దర్శకులు కూడా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించారు. ఇక కొంతమంది దర్శకులు అయితే అతిథి పాత్రల్లో కనిపించి మెరిపించారు. ‘ఏ మాయ చేశావే’ సినిమాలో పూరిజగన్నాథ్, నాని ‘గ్యాంగ్ లీడర్’లో సుకుమార్, ‘రెయిన్ బో’ మూవీలో రాజమౌళి.. ఇలా చాలామంది తమ సినిమాలతో పాటు ఇతర సినిమాల్లో కూడా అతిథి పాత్రల్లో కనిపించారు.

 

Also Read : Salaar : జపాన్‌లో కూడా సలార్ గ్రాండ్ రిలీజ్.. ఎప్పుడో తెలుసా?