Telangana State Commission for Women : ఇటీవల రాబిన్ హుడ్ సినిమాలో, అంతకుముందు డాకు మహారాజ్ సినిమాలో ఐటెం సాంగ్స్ లో స్టెప్స్ అసభ్యకరంగా ఉన్నాయి అంటూ పలువురు విమర్శలు చేసారు. డ్యాన్స్ మాస్టర్ శేఖర్ ని కూడా ట్రోల్ చేసారు. రాబిన్ హుడ్ సాంగ్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ వీటి ఆధారంగా, వాళ్లకు వచ్చిన ఫిర్యాదులతో సినిమాల్లో స్టెప్స్ విషయంలో మహిళలను అసభ్యతగా చూపించొద్దు అంటూ హెచ్చరిస్తూ నోటిస్ విడుదల చేసింది.
ఈ నోటీసులో.. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఇటీవల కొన్ని సినిమా పాటల్లో ఉపయోగిస్తున్న డాన్స్ స్టెప్స్ అసభ్యంగా, మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని పలు ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై కమిషన్ తీవ్రంగా స్పందించింది. సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమం కావడంతో, ఇందులో మహిళలను అవమానించే లేదా అసభ్యకరంగా చూపించే అంశాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, సినిమా దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు మరియు సంబంధిత వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మహిళా కమిషన్ హెచ్చరిస్తోంది. మహిళలను తక్కువ చేసి చూపించే, అసభ్యకరమైన డాన్స్ స్టెప్స్‌ను వెంటనే నిలిపివేయాలి. ఈ హెచ్చరికను పాటించకపోతే, సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. సినిమా రంగం సమాజానికి సానుకూల సందేశాలను అందించడం, మహిళల గౌరవాన్ని కాపాడటం అనేది నైతిక బాధ్యత. యువత, పిల్లలపై సినిమాలు చూపించే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, సినిమా పరిశ్రమ స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది. ఈ అంశంపై ప్రజలు, సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలను మహిళా కమిషన్‌కు తెలియజేయవచ్చు. ఈ విషయంపై నిశితంగా పరిశీలన కొనసాగిస్తూ, అవసరమైన మరిన్ని చర్యలు తీసుకుంటాం అంటూ తెలిపారు.
మరి దీనిపై సినిమా వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే దీనిపై పలువురు విమర్శలు చేస్తున్నారు. డ్యాన్స్ చేసే వాళ్ళు డబ్బులు తీసుకొని మరీ డ్యాన్సులు వేస్తున్నారు, అంతకంటే దారుణమైన, విచ్చలవిడి సిరీస్ లు, సినిమాలు వస్తున్నాయి. ఆ డ్యాన్సులకు చాలా మంది అమ్మాయిలు రీల్స్ చేస్తున్నారు మరి వీరెవర్నీ విమర్శించరా? అంత అసభ్యత ఉంటే డ్యాన్స్ చేసే వాళ్ళే ఆపేయొచ్చు కదా, చాలా మంది హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేస్తున్నారు అంటూ ప్రశ్నిస్తూ విమర్శలు చేస్తున్నారు.
Also Read : L2 Empuraan Trailer : పవర్ ఫుల్ మోహన్ లాల్ ‘లూసిఫర్ 2’ సినిమా ట్రైలర్ వచ్చేసింది..