Site icon HashtagU Telugu

RRR Movie Ticket Rates: ఆర్ఆర్ఆర్ సినిమాకు.. తెలంగాణ స‌ర్కార్ బంప‌ర్ ఆఫ‌ర్..!

Rrr Movie Ticket Rates

Rrr Movie Ticket Rates

ఆర్ఆర్ఆర్ నిర్మాత‌ల‌కు తెలంగాణ స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రోజుకు ఐదు ఆట‌లు ప్ర‌ద‌ర్శించుకునేందుకు అనుమ‌తి ఇచ్చిన తెలంగాప ప్ర‌భుత్వం టికెట్ ధ‌ర‌లు పెంచుకునేందుకు కూడా అనుమ‌తి ఇచ్చింది. ఈ క్ర‌మంలో తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, సినిమా విడుదలైన తర్వాత మొద‌టి మూడు రోజులు ఏసీ థియేటర్లలో టికెట్​పై 50 రూపాయ‌లు అధికంగా వసూలు చేసుకోవచ్చ‌ని, ఆత‌ర్వాత ఏడు రోజులు 30 రూపాయ‌లు పెంచుకోవ‌చ్చిన‌ తెలంగాణ ప్ర‌భుత్వం ఆర్ఆర్ఆర్ సినిమాకు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది.

ఇక నాన్ ఏసీ థియేటర్ల విషయంలో రేట్ల పెంపు లేదని తెలంగాణ స‌ర్కార్ స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7 నుంచి రాత్రి ఒంటి గంట మధ్య థియేటర్లలో ఐదు ఆటలు ప్రదర్శించుకునేందుకు ప‌ర్మిష‌న్ ఇచ్చింది. దీంతో ఆర్ఆర్ఆర్ నిర్మాత‌ల పంట పండిన‌ట్టే అని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. ఇక మ‌రోవైపు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రేట్ల పెంపునకు అనుమతి ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఏపీలో అన్ని రకాల టికెట్లపై అదనంగా 75 రూపాయ‌లు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. సినిమా విడుదల తేదీ నుంచి 10 రోజులపాటు పెంచిన ధరలు వర్తిస్తాయని ఏపీ ప్ర‌భుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇక‌పోతే టాలీవుడ్ జ‌క్క‌న్న‌ రాజమౌళి ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కించిన ప్రతిష్టాత్మక భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో నంద‌మూరి హీరో తార‌క్, మెగా హీరో చ‌ర‌ణ్‌లు హీరోలుగా న‌టించ‌గా, బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్, విదేశీ భామ ఒలీవియ మోరిస్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్నారు. అజ‌య్ దేవ్ గ‌న్, స‌ముద్ర‌ఖ‌ని, శ్రియ త‌దిత‌రులు కీల‌క‌పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్, ట్రైల‌ర్, సాంగ్స్‌కు ఓరేంజ్‌లో రెస్పాన్స్ రావ‌డంతో ఊహించిన‌ట్టే ఈసినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ క్ర‌మంలో పాన్ ఇండియా లెవ‌ల్లో మార్చి 25న గ్రాండ్‌గా విడుద‌ల కాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.