Bathukamma Singers: బతుకమ్మ పాటలకు ప్రాణం పోస్తున్నారు!

దసరా వస్తోందంటే చాలు.. బతుకమ్మ పాటల సందడే కనిపిస్తుంది. ఈ సీజన్‌లో కొత్త కొత్త పాటలు కూడా విడుదలవుతూ ఉంటాయి.

Published By: HashtagU Telugu Desk

దసరా వస్తోందంటే చాలు.. బతుకమ్మ పాటల సందడే కనిపిస్తుంది. ఈ సీజన్‌లో కొత్త కొత్త పాటలు కూడా విడుదలవుతూ ఉంటాయి. తెలంగాణలో ప్రతి ఏడాది బతుకమ్మ మీద పాటల రిలీజ్ అవుతూనే ఉంటాయి. అలా విడుదలైనవన్నీ సక్సెస్ అవుతూనే ఉన్నాయి.

మంగ్లీ
సత్యవతి రాథోడ్ అలియాస్ మంగ్లీ కేవలం బతుకమ్మ పాటలే కాదు.. సినిమాల్లో ఎన్నో హిట్ సాంగ్స్ పాడింది. లవ్ స్టోరీ సినిమాలోని సారంగ దరియా పాట ఎన్ని రికార్డులు కొల్లగొట్టిందో తెలిసిందే. ఓ వైపు సినిమాల్లో పాడుతూనే పండగల సందర్భంగా కొన్ని ప్రత్యేక పాటలు విడుదల చేస్తోంది. ఉగాది, సంక్రాంతికి కూడా ప్రత్యేక గీతాలు ఆలపించింది. ఇక మంగ్లీ పాడిన బతుకమ్మ పాటల గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకు 15 బతుకమ్మ పాటలు పాడింది. కేవలం పాడడమే కాదు.. పాటలకు డ్యాన్సులు కూడా కంపోజ్ చేస్తుంది మంగ్లీ.

మౌనిక సింగ్ యాదవ్
బతుకమ్మ పాటలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన మరో సింగర్ మౌనిక సింగ్ యాదవ్. ఈ గాయని ఇప్పటి వరకు 20 బతుకమ్మ పాటలు పాడింది. కేవలం పాటలు పాడడమే కాదు.. పండగల సందర్భంగా విడుదల చేసే వీడియోలో నటిస్తుంది కూడా. బతుకమ్మ పాటలు పాడడం అంటే ఇష్టంతో పాటు గౌరవం కూడా అని చెబుతోంది మౌనిక. ప్రస్తుత కాలంలో బతుకమ్మ పాటలను కూడా ఫాస్ట్ బీట్‌లుగా మారుస్తున్నారు. డీజే సౌండ్లతో రీమిక్స్ చేస్తున్నారు. ఇలాంటి ట్రెండును వ్యతిరేకించకపోయినప్పటికీ.. బతుకమ్మ పాటలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను రాబోయే తరాలకు అందించేదిగా ఉండాలని చెబుతోంది.

కనకవ్వ
కనకవ్వ పాట ఇప్పుడొక సెన్సేషన్. మైక్ టీవీ అనే యూట్యూబ్ ఛానెల్‌లో పాడిన తరువాత తెలంగాణతో పాటు ఏపీ ప్రజలకు కూడా కనకవ్వ చేరువైంది. 64 ఏళ్ల ఈ కనకవ్వ ఇప్పటి వరకు 8 బతుకమ్మ పాటలు పాడింది. ఈ ఎనిమిదింటిలో దాదాపు అన్నీ హిట్లే. విచిత్రం ఏంటంటే కనకవ్వకు చదవడం, రాయడం రాదు. కాని, జానపద పాటలను అద్భుతంగా పాడుతుంది. చిన్నప్పుడు అమ్మ పాడుతుంటే నేర్చుకున్న జానపదాలను విని నేర్చుకున్న కనకవ్వ.. ఇప్పుడవే పాటలను తనదైన శైలిలో పాడుతోంది. తెలంగాణ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లేలా.. తనవంతుగా బతుకమ్మ పాటలను పాడడం గర్వంగా ఉంటుందని చెబుతోంది కనకవ్వ.

  Last Updated: 28 Sep 2022, 04:22 PM IST