Site icon HashtagU Telugu

Mangalavaram: అజయ్ భూపతి ‘మంగళవారం’ సినిమాలో తరుణ్ భాస్కర్ స్పెషల్ సాంగ్!

Mangalavaram

Mangalavaram

Mangalavaram: ‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా ‘మంగళవారం’. పాయల్ రాజ్‌పుత్, ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించారు. నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి అజయ్ భూపతి ‘A’ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామి. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎంతో కలిసి చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘మంగళవారం’ సినిమాలో యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ ‘అప్పడప్పడ తాండ్ర ఆవకాయ తాండ్ర…’ అంటూ సాగే ప్రత్యేక గీతం చేశారు. గణేష్ ఎ రాసిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఈరోజు సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేశారు. అజనీష్ లోక్‌నాథ్ బాణీకి తోడు తరుణ్ భాస్కర్ మాసీ గెటప్ ‘అప్పడప్పడు తాండ్ర ఆవకాయ తాండ్ర…’లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పాలి.

‘అప్పలరాజు పెళ్ళాం
సుబ్బన్నతో సయ్యాట
సుబ్బిగాడి పెళ్ళమేమో
నాగన్నతో కాట్లాట
నాయుడుగారి తోటలోన తొక్కుడు బిళ్ళాలాట…’
అంటూ సాగే కోరస్… ‘మొన్నేమో అది జరిగింది నిన్నేమో ఇది జరిగింది’ డైలాగ్ వింటే….
పల్లెటూరు వీధుల్లో, పొలం గట్లలో ఫలానా విధంగా జరిగిందంటూ ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆ కథలను పాట రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు అజయ్ భూపతి. పల్లెటూరులో పెరిగిన వాళ్లు చిన్నతనంలో ‘అప్పడప్పడు తాండ్ర ఆవకాయ తాండ్ర…’ అని ఆటలు ఆడుకుని ఉంటారు. ఆ ఆటకు ఇప్పుడు పాట తోడైంది.

దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ ”తరుణ్ భాస్కర్ ఈ సాంగ్ చేయడం ఓ స్పెషల్ అయితే… మాస్ గెటప్, లుంగీలో డాన్స్ చేయడం మరో స్పెషల్. కోనసీమలోని ఓ పల్లెటూరిలో ఈ పాటను చిత్రీకరించారు. సింగిల్ లొకేషన్ కాకుండా… పల్లెటూరి వాతావరణం తెరపై ప్రతిబింబించేలా వివిధ లొకేషన్లలో షూట్ చేశాం. మా మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ ఇరగదీశాడు. సినిమాలోని ఓ మంచి సందర్భంలో ఈ పాట వస్తుంది. పల్లె ప్రజల మధ్య సంభాషణలు, ఊరిలో పరిస్థితులను తెరపై ఆవిష్కరించేలా పాట ఉంటుంది.

సినిమాకు వస్తే… ఇదొక డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద రానటువంటి ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా అందరికీ నచ్చే చిత్రమిది” అని చెప్పారు. ఇటీవల విడుదల చేసిన సినిమా ట్రైలర్, ఆల్రెడీ విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తుందని నిర్మాతలు స్వాతి రెడ్డి, సురేష్ వర్మ సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు ‘అప్పడప్పడు తాండ్ర ఆవకాయ తాండ్ర…’ పాటు కూడా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుందని చెప్పారు.