Tollywood Casting Couch : సినీ పరిశ్రమలో ‘క్యాస్టింగ్ కౌచ్’ (లైంగిక వేధింపులు) అంశం మరోసారి చర్చనీయాంశమైంది. మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు, వాటికి సింగర్ చిన్మయి ఇచ్చిన కౌంటర్ వీటిపై తాజాగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.
ఇటీవల మన శంకర వరప్రసాద్ మూవీ సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ లేదని, మహిళలు ఇక్కడ సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలను ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద తీవ్రంగా వ్యతిరేకించారు. పరిశ్రమలో జరుగుతున్న వాస్తవాలను చిరంజీవి వంటి పెద్దలు దాచిపెడుతున్నారని ఆమె సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. తాజాగా ఈ వివాదంపై స్పందించిన ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, చిన్మయి మాటల్లో వాస్తవం ఉందని పేర్కొంటూ చిరంజీవి వ్యాఖ్యలను సున్నితంగా తప్పుపట్టారు.
Chiru Speech
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. పరిశ్రమలో వేధింపులు లేవని చెప్పడం కరెక్ట్ కాదని, ఇక్కడ కూడా లైంగిక వాంఛలు తీర్చుకోవాలని చూసే వికృత ధోరణి కలిగిన వ్యక్తులు ఉన్నారని అంగీకరించారు. ముఖ్యంగా ఒకరిద్దరు పెద్దల ప్రమేయం కూడా ఇందులో ఉందనే సంచలన విషయాన్ని ఆయన బయటపెట్టారు. అందరూ తప్పు చేయకపోయినా, కొందరు వ్యక్తుల వల్ల మొత్తం పరిశ్రమకు చెడ్డపేరు వస్తోందని, బాధితుల గోడును వినాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. టాలీవుడ్‌లో ఏడాదికి సుమారు 250 సినిమాలు నిర్మితమవుతుంటే, అందులో 30 నుండి 40 చిత్రాలు కేవలం మహిళలను వాడుకోవడానికే తీస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది కాదనలేని వాస్తవమని, కేవలం వేధింపుల కోసమే సినిమాలు తీసే సంస్కృతి కొంతమందిలో ఉందని ఆయన మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.
