Site icon HashtagU Telugu

Tamannaah: మెగాస్టార్‌తో స్టెప్పులు వేయ‌నున్న‌ మిల్కీ బ్యూటీ!

Tamannaah

Tamannaah

Tamannaah: మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాపై అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సంక్రాంతి 2026 సందర్భంగా విడుదల కానున్న ఈ భారీ చిత్రం నుంచి తాజాగా ఓ మాస్ అప్‌డేట్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

చిరంజీవి-తమన్నా మాస్ స్టెప్పులు?

తాజా నివేదికల ప్రకారం.. ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాట (ఐటమ్ సాంగ్) ఉండబోతుందని, అందులో మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) భాటియా మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్టెప్పులు వేయనున్నారని సమాచారం. స్పెషల్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన తమన్నా గతంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో సూపర్ హిట్ నంబర్‌లో కనిపించారు. అంతేకాకుండా చిరంజీవితో కలిసి ఆమె గతంలో రెండు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఈ కొత్త పాటపై అంచనాలను పెంచుతోంది.

ఈ పాట కోసం చిత్ర యూనిట్ ఓ టాప్ కొరియోగ్రాఫర్‌ను ఎంపిక చేసిందని, ఈ స్పెషల్ సాంగ్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, మెగాస్టార్- తమన్నా కాంబో తెరపై కనిపిస్తే అభిమానులకు మాస్ ఫీస్ట్ ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also Read: India A U19: అండర్-19 ట్రై సిరీస్‌కు భారత్-ఏ, భారత్-బి జట్ల ప్రకటన.. ద్రవిడ్ చిన్న కొడుకుకు చోటు!

విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్రలో

చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా మరో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ అక్టోబర్‌లో ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నారని, చిరంజీవితో కలిసి ఒక పాటలో కూడా ఆయన కనిపించనున్నారని సమాచారం. ఈ మల్టీస్టారర్ ఎలిమెంట్ సినిమాకు మరింత హైప్‌ను జోడించింది.

రికార్డులు బ్రేక్ చేసిన ‘మీసాల పిల్లా’

ఇటీవల విడుదలైన ఈ సినిమా మొదటి సింగిల్ ‘మీసాల పిల్లా’ ఇప్పటికే 50 మిలియన్లకు పైగా వీక్షణలతో యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. గత మూడు వారాలుగా ఈ పాట టాప్-10 ట్రెండింగ్‌లో కొనసాగుతూ.. సంక్రాంతి విడుదలకు మంచి బజ్‌ను తెచ్చిపెట్టింది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. కేథరిన్ ట్రెసా మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ సన్నివేశాల షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version