Film Workers: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నెలకొన్న సినీ కార్మికుల (Film Workers) సమ్మె వివాదం పరిష్కారానికి చేరువ అవుతోంది. హైదరాబాద్ చిక్కడపల్లిలోని లేబర్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం నుంచి ఫిల్మ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో నిర్మాతలు, కార్మిక సంఘాల మధ్య వాడివేడిగా చర్చలు జరిగాయి. ఆరు గంటలకు పైగా కొనసాగిన ఈ చర్చలు తుది దశకు చేరుకున్నాయి.
నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న పరిశ్రమ
గత కొద్ది రోజులుగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని, ఈరోజు రాత్రికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని నిర్మాతలు గట్టిగా భావిస్తున్నారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు కార్మిక సంఘాలను ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ చర్చలలో లేబర్ డిపార్ట్‌మెంట్ అడిషనల్ కమిషనర్ గంగాధర్ కూడా పాల్గొన్నారు. ఆయన కార్మికుల సంఘాల నేతలు, నిర్మాతలతో విడివిడిగా మాట్లాడి ఇరు వర్గాలను ఒకే అభిప్రాయానికి తీసుకువచ్చేందుకు కృషి చేశారు.
Also Read: Online Gaming Bill: రాజ్యసభలో ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం.. ఏ రకమైన యాప్‌లు నిషేధించబడతాయి?
ప్రధాన సమస్యలు
ఈ చర్చలలో ప్రధానంగా రెండు అంశాలపై కార్మిక సంఘాలు పట్టుబట్టాయి.
- షూటింగ్ సమయాలు- ఆదివారం పని వేతనాలు: షూటింగ్ సమయాలను నిర్ణయించడం, ఆదివారం షూటింగ్‌లలో పాల్గొంటే ఇవ్వాల్సిన అదనపు వేతనాలపై కార్మికులు స్పష్టత కోరారు.
- వేతనాల పర్సంటేజీ: కార్మికులకు చెల్లించే వేతనాల పర్సంటేజీని పెంచాలని డిమాండ్ చేశారు.
ఈ రెండు ప్రధాన డిమాండ్లలో వేతనాల విషయంలో కొంత స్పష్టత ఇవ్వాలని కార్మిక సంఘాలు పదే పదే అడుగుతున్నాయి. కార్మికులు తమ డిమాండ్లపై దృఢంగా ఉండటంతో చర్చలు సుదీర్ఘంగా కొనసాగాయి. నిర్మాతలు- కార్మిక సంఘాల మధ్య సుదీర్ఘంగా సాగిన ఈ చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. నిర్మాతలు మీడియా సమావేశం నిర్వహించి, చర్చల ఫలితాలు, తీసుకున్న నిర్ణయాలను వెల్లడించే అవకాశం ఉంది. ఈ నిర్ణయాలు తెలుగు సినీ పరిశ్రమ భవిష్యత్తును ప్రభావితం చేయనున్నాయి. సమ్మె విరమిస్తుందా లేదా అన్న సస్పెన్స్ వీడనుంది.