Actress Pratyusha Case : నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడికి సుప్రీం కోర్టు బిగ్ షాక్

రెండు దశాబ్దాల క్రితం తెలుగు చలనచిత్ర పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన గుడిపల్లి సిద్ధార్థ రెడ్డికి హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది

Published By: HashtagU Telugu Desk
Prathyusha Death Case

Prathyusha Death Case

 

రెండు దశాబ్దాల క్రితం తెలుగు చలనచిత్ర పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన గుడిపల్లి సిద్ధార్థ రెడ్డికి హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. తనకు పడిన శిక్షను సవాలు చేస్తూ సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను, అలాగే నిందితుడికి శిక్ష పెంచాలని కోరుతూ ప్రత్యూష తల్లి సరోజిని వేసిన అప్పీళ్లను విచారించిన ధర్మాసనం.. తుది తీర్పునిస్తూ సిద్ధార్థ రెడ్డిని నాలుగు వారాల్లోగా పోలీసులకు లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో 24 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం ఒక కీలక మలుపు తిరిగింది.

ప్రేమ వ్యవహారం నుండి విషాదం వరకు

నటిగా ఎదుగుతున్న సమయంలోనే 2002 ఫిబ్రవరి 23న ప్రత్యూష మరియు సిద్ధార్థ రెడ్డి విషం తాగి ఆసుపత్రిలో చేరారు. మరుసటి రోజున ప్రత్యూష మరణించగా, సిద్ధార్థ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డారు. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారని, పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఆత్మహత్యాయత్నం చేశారని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. అయితే, ఇది ఆత్మహత్య కాదు, పక్కా పథకం ప్రకారం జరిగిన హత్యని ప్రత్యూష తల్లి సరోజిని మొదటి నుండి ఆరోపిస్తూనే ఉన్నారు. పోస్టుమార్టం నివేదికలో లైంగిక దాడి ఆనవాళ్లు ఉన్నాయని అప్పట్లో వైద్యుడు మునుస్వామి పేర్కొన్నప్పటికీ, ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ మాత్రం ఆత్మహత్యగానే ధృవీకరించడం ఈ కేసులో వివాదాస్పదంగా మారింది.

సుదీర్ఘ న్యాయ ప్రక్రియ మరియు తల్లి ఆవేదన

ఈ కేసును విచారించిన సీబీఐ.. సిద్ధార్థ రెడ్డిపై ఆత్మహత్య ప్రేరేపణ (సెక్షన్ 306) కింద అభియోగాలు మోపింది. 2004లో సెషన్స్ కోర్టు ఐదేళ్ల శిక్ష విధించగా, 2011లో హైకోర్టు దానిని రెండేళ్లకు తగ్గించింది. తాజా సుప్రీంకోర్టు తీర్పుపై ప్రత్యూష తల్లి సరోజిని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం రెండేళ్ల శిక్ష విధించడం న్యాయం కాదని, తన కుమార్తెపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారని ఆమె వాదిస్తున్నారు. పోస్టుమార్టం నివేదికలను కోర్టులు సరైన కోణంలో పరిగణనలోకి తీసుకోలేదని, నిందితుడు పలుకుబడితో పెద్ద శిక్ష నుండి తప్పించుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానం తీర్పును గౌరవిస్తానని చెప్తూనే, తల్లిగా తనకు తీరని అన్యాయం జరిగిందని ఆమె పేర్కొన్నారు.

 

  Last Updated: 17 Feb 2026, 11:58 AM IST