Jacqueline Fernandez: రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez)కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం ఈ కేసుపై సుప్రీంకోర్టు విచారణను నిరాకరించింది. విచారణ జరుగుతున్నందున ప్రస్తుతం జోక్యం చేసుకోబోమని, సరైన సమయంలో ఆమె మళ్లీ పిటిషన్ దాఖలు చేయవచ్చని కోర్టు పేర్కొంది. దీంతో జాక్వెలిన్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేసిన జాక్వెలిన్
మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్‌తో సంబంధం ఉన్న 200 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో తనపై జరుగుతున్న విచారణను రద్దు చేయాలని కోరుతూ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌ను హైకోర్టు జూలై 3న కొట్టివేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ జాక్వెలిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై జరుగుతున్న విచారణను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆమె కోర్టును అభ్యర్థించారు.
జాక్వెలిన్ తన పిటిషన్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్’ (ECIR), ఇతర సప్లిమెంటరీ ఫిర్యాదులను సవాలు చేశారు. ఈ నివేదికల్లో ఆమెను పదవ నిందితురాలిగా చేర్చారు. తాను సుఖేష్ చంద్రశేఖర్ కుట్రకు బలైన బాధితురాలినని, తాను నిర్దోషినని ఈడీ నివేదికలే రుజువు చేస్తున్నాయని జాక్వెలిన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Also Read: They Call Him OG Trailer: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ట్రైలర్ విడుదల.. బాంబే వస్తున్నా.. తలలు జాగ్రత్త!
జాక్వెలిన్ వాదనలు
ఈడీ రికార్డుల ప్రకారం.. తిహార్ జైలు అధికారులు సుఖేష్ చంద్రశేఖర్‌కు మొబైల్ ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విచ్చలవిడిగా ఉపయోగించే అవకాశం ఇచ్చారని జాక్వెలిన్ వాదించారు. సుఖేష్ జైలులో లభించిన ఈ సౌకర్యాలను ఉపయోగించుకుని పలువురు సినీ ప్రముఖులతో పాటు తనను కూడా మోసం చేశారని ఆమె ఆరోపించారు. ఈడీ మొదట తనను సాక్షిగా పరిగణించిందని, కాబట్టి తర్వాత నిందితురాలిగా పేర్కొనే చర్యలు చెల్లవని ఆమె వాదించారు.
ఢిల్లీ హైకోర్టు ఆదేశం
అయితే జాక్వెలిన్ వాదనలను ఢిల్లీ హైకోర్టు జస్టిస్ అనిష్ దయాల్ జూలై 3న తోసిపుచ్చారు. సాక్ష్యాల ఆధారంగా నేరం నిరూపితం కావచ్చనే భయం, ఈసీఐఆర్‌ను రద్దు చేయడానికి సరైన కారణం కాదని ఆయన అన్నారు. ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఆరోపణలు ఉన్నప్పుడు స్వీయ-నిందల నుంచి రక్షణ కోసం చట్టం, రాజ్యాంగంలో తగిన రక్షణ నిబంధనలు ఉన్నాయని, వాటిని విచారణ సమయంలోనే సమీక్షించాలని, ప్రాథమిక దశలో కాదని కోర్టు స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో జాక్వెలిన్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. కానీ అక్కడ కూడా ఆమెకు చుక్కెదురైంది.
