Site icon HashtagU Telugu

Jani Master Case Updates: జానీ మాస్టర్ కు భారీ ఊరట… ఆ పిటిషన్ ను కొట్టేసిన సుప్రీమ్ ధర్మాసనం…

Jani Master Case Updates

Jani Master Case Updates

ప్రసిద్ధ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో అరెస్టయ్యారు. ఈ కేసులో ఆయన దాదాపు నెల రోజుల పాటు జైలు జీవితం గడిపారు. అక్టోబర్ 24న ఆయన బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, హైకోర్టు బెయిల్ మంజూరు చేయటాన్ని ఫిర్యాదుదారు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్‌ను రద్దు చేయాలని బాధితురాలు సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

ఈ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. కానీ, జానీ మాస్టర్‌కు ఈ విషయంలో ఊరట లభించింది. సుప్రీం కోర్టు ధర్మాసనం పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్‌లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో జానీ మాస్టర్‌కు ఒక భారీ ఊరట లభించింది.

జానీ మాస్టర్‌ లైంగిక దాడి చేశాడంటూ అతడితో గతంలో అసిస్టెంట్‌గా పనిచేసిన ఒక లేడీ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆమె 2017లో జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేశాడని, ఈ విషయాన్ని బయట చెప్పినట్టయితే చంపేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె కథనలు ప్రకారం, షూటింగ్ కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళిన సందర్భంలో కూడా జానీ మాస్టర్ తనపై లైంగిక దాడి చేశాడని, ఆమె మైనర్‌గా ఉన్నప్పుడు కూడా ఈ దాడులు జరిగాయని ఆరోపించారు. జానీ మాస్టర్ ఆమెపై పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి కూడా చేసినట్లు ఫిర్యాదులో తెలిపింది.

ఈ ప్రకటనల ఆధారంగా జానీ మాస్టర్‌పై పాక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. అతడు దాదాపు నెలరోజులు జైలులో ఉన్న తరువాత, ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడు.

బెయిల్‌పై విడుదలైన తర్వాత, జానీ మాస్టర్ తాజాగా జబర్దస్త్ రాకేష్ కేసీఆర్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. అరెస్ట్, బెయిల్ సంబంధిత అంశాలు తరవాత ఇది జానీ మాస్టర్ స్టేజ్‌పై మాట్లాడటం, మీడియా ముందుకు రావడం మొదటి సారి. అందరూ ఎంతో ఆసక్తిగా ఆయన ఏమి మాట్లాడతారో అనుకున్నప్పుడు, జానీ మాస్టర్ చాలా ఎమోషనల్‌గా స్పందించారు.

ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ, ‘రీసెంట్‌గా కొన్ని కొన్ని సంఘటనలు జరిగాయి.. ఇలా జరిగినప్పుడు బయటకు ఎవ్వరూ రారు.. తనను నమ్మిన ప్రతీ ఒక్కరికీ.. తనను ఇంట్లో బిడ్డలా అనుకుని ఆశీర్వదించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మీరు పెట్టుకున్న నమ్మకం ఎక్కడికి పోదు.. త్వరలోనే అన్నీ తెలుస్తాయ్’ అని జానీ మాస్టర్ వెల్లడించారు.

కాగా, ఈ ఇష్యూ తర్వాత ఆయనకు నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. 2022 ఏడాదికి గానూ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు ఫర్‌ బెస్ట్‌ కొరియోగ్రఫీకి జానీ మాస్టర్‌ ఎంపికయ్యారు. అవార్డు అందుకునేందుకు జానీ మాస్టర్‌కు ఆహ్వానం సైతం అందింది. అయితే పోక్సో చట్టం కింద ఆయనపై కేసు నమోదు కావటంతో నేషనల్‌ అవార్డును నిలిపివేస్తున్నట్లు అవార్డు కమిటీ ప్రకటించింది.

Exit mobile version